రావమ్మా.. ఆరోగ్యశ్రీ!

ABN , First Publish Date - 2020-09-13T07:37:27+05:30 IST

రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ప్రజల్లో కొత్త ఆశలు రేపుతోంది. కరోనా సోకితే ఆస్తులు తెగనమ్ముకొని లక్షల్లో ఫీజులు చెల్లించడం ద్వారా ఇల్లు గుల్ల

రావమ్మా..  ఆరోగ్యశ్రీ!

ఈ పథకంలోకి కరోనా చికిత్స

కేసీఆర్‌ ప్రకటనలతో నిరుపేదల్లో ఆశలు

పథకం అమలు కోసం అంతా ఎదురుచూపు


అప్పులు చేసి.. లక్షల్లో ఫీజులు చెల్లించే బాధ తప్పుతుందన్న భావన 

ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోకి వైరస్‌ చికిత్స

ఈహెచ్‌ఎస్‌ కింద కరోనాను చేర్చాలని ఉద్యోగుల డిమాండ్‌

ముందుగా తమతో చర్చలు జరపాలంటున్న ఆస్పత్రుల యాజమాన్యాలు


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన ప్రజల్లో కొత్త ఆశలు రేపుతోంది. కరోనా సోకితే ఆస్తులు తెగనమ్ముకొని లక్షల్లో ఫీజులు చెల్లించడం ద్వారా ఇల్లు గుల్ల చేసుకునే ముప్పు తప్పుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా  మహమ్మారి చికిత్సను  మెజారిటీ రాష్ట్రాలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోకి తెచ్చాయి.  ఆరోగ్య పఽథకాలు లేని రాష్ట్రాలు కేంద్రం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్స అందిస్తున్నాయి.


రాష్ట్రంలో మాత్రం కరోనా వస్తే పేదలకు సర్కారు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. అక్కడ సరైన వైద్యం లభించదన్న భయంతో పేదల్లో కొందరు,  ప్రైౖవేటు ఆస్పత్రుల్లో చేరి లక్షల్లో ఫీజులు చెల్లించుకొని అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో 1.5 లక్షల కేసులు నమోదు కాగా, 40 వేల మంది దాకా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. పొందుతున్నారు. వారిలో ప్రైవేటులో 67 శాతం రోగులుంటే, ప్రభుత్వ దవాఖానల్లో 33 శాతమే ఉన్నారు.  


ఆరోగ్యశ్రీలోకి చేరిస్తే..

 రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద 333 ప్రైవేటు ఆస్పత్రులు సేవలందిస్తున్నాయి.  మెజారిటీ ఆస్పత్రులు.. హైదరాబాద్‌, రంగారెడ్డి చుట్టూనే ఉన్నాయి. కరోనా కేసులు కూడా ఈ చుట్టు పక్కల జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కరోనా సోకినవారు ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.2.5 నుంచి రూ.4 లక్షల మధ్యలో బిల్లు అవుతోంది. కొంచెం సీరియ్‌సగా ఉన్న రోగులకు రూ.10 లక్షలు.. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికైతే రూ.40-45 లక్షల దాకా బిల్లులు వేస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ పథకంలోకి కరోనా చికిత్సను తీసుకొస్తే పేదలకు అది గొప్ప భరోసా కానుంది. కరోనా సోకితే చికిత్స కోసం అప్పులు చేసి లక్షల్లో ఫీజులు వెచ్చించే బెడద తప్పుతుంది. వైరస్‌ సోకిన పేదలు ఆరోగ్య శ్రీ కార్డును పట్టుకొని ప్రైవేటు ఆస్పత్రులకే వెళతారు. అక్కడ పైసా ఖర్చు లేకుండా వారికి నాణ్యమైన వైద్యం లభిస్తుంది.  


ఇప్పటికే 600-700 కోట్ల బకాయిలు! 

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న ఆస్పత్రులకు  రూ.600-700 కోట్ల బకాయిలను చెల్లించాల్సివుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. కరోనాను ఆరోగ్యశ్రీలోకి చేరిస్తే బకాయిలు ఇంకా పేరుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీలోకి చేర్చే ముందు ప్రైవేటు ఆస్పత్రులతో సమావేశమై చర్చించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. అలా కాకుండా బలవంతంగా రుదొద్దని కోరుతున్నాయి.


వైరస్‌ చికిత్సకు సర్కారీ ప్యాకేజ్‌ ధరలే చెల్లిస్తామంటే అన్ని ఆస్పత్రులు ముందుకు రాకపోవచ్చునని అంటున్నాయి. ప్రస్తుతం కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల్లో పనిచేసేందుకు సిబ్బంది దొరకడం లేదని, వారికి రెట్టింపు జీతాలను ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నాయి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ఆస్పత్రుల్లో రాకపోకలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలుండాలని, కొన్ని ఆస్పత్రులకు ఆ సౌకర్యం లేదంటున్నాయి. ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందిస్తే... కొన్ని చోట్ల నాన్‌ కొవిడ్‌ సేవలు బంద్‌ అవుతాయని చెబుతున్నాయి.   


ఉద్యోగులు కూడా ఎదురుచూపు..

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలపి మొత్తం 6 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రస్తుతం ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) కింద సర్కారు వైద్యం అందిస్తోంది. ఉద్యోగుల కోసం వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాయి. వైరస్‌ సోకిన ఉద్యోగులు, ప్రైవేటుకే వెళ్లి చికిత్స తీసుకున్నారు.


ఇంతవరకు ఏ ఉద్యోగి కూడా కరోనా చికిత్స బిల్లులను రీయింబర్స్‌ కింద పెట్టలేదని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లులు అవుతున్నాయని, రీయంబర్స్‌మెంట్‌ పెట్టినా... రూ.2లక్షలకు మించి రాదని అంటున్నారు. కరోనా చికిత్సను ఈహెచ్‌ఎస్‌ కింద చేర్చాలని కోరుతున్నారు. కాగా కరోనా చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం చేసే విషయం ఆలోచిస్తామని నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దాంతో ప్రైవేటులో చికిత్స పొందిన బాధితులంతా దీనికోసం ఎదురుచూస్తున్నారు.


అయితే ఎంత మొత్తంలో బిల్లు అయినా రూ.60 వేలు మాత్రమే సీఎంఆర్‌ఎఫ్‌ కింద చెల్లిస్తున్నారు. కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లు అవుతుండటంతో సర్కారు ఎంత మేరకు సాయం చేస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా కరోనా చికిత్సను ఈహెచ్‌ఎస్‌ కింద చేర్చాలని టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి కోరారు. 


బలవంతంగా రుద్దొద్దు

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కింద చేర్చే ముందు ఆస్పత్రులతో ప్రభుత్వం చర్చలు జరపాలి.. అన్ని ఆస్పత్రులకు ఇది సాధ్యం అవుతుందో లేదో శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాకాకుండా అన్ని ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాల్సిందేనంటూ బలవంతంగా మాత్రం రుద్దొద్దు. 

- డాక్టర్‌ రాకేశ్‌, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం ప్రతినిధి  


Updated Date - 2020-09-13T07:37:27+05:30 IST