భూతవైద్యం పేరిట బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2020-10-14T06:39:17+05:30 IST

భూతవైద్యం పేరిట బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో మృగాడు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం ..

భూతవైద్యం పేరిట బాలికపై అత్యాచారం

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 13: భూతవైద్యం పేరిట బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో మృగాడు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలో పూసలగల్లీలోని లక్ష్మీరాజం కాంప్లెక్స్‌లో వరప్రసాద్‌ అనే వ్యక్తి వెబ్‌ చానెల్‌ రిపోర్టర్‌గా చెలామణి అవుతూ.. భూతవైద్యుడిగా జనాన్ని నమ్మిస్తున్నాడు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన 15 ఏళ్ల బాలికకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మూడునెలల క్రితం వరప్రసాద్‌ను సంప్రదించారు. బాలికకు నయం కావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నమ్మించి.. వైద్యం పేరుతో బాలికకు అతడు నిద్రమాత్రలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, చంపుతానని బాధితురాలిని బెదిరించాడు. వారం రోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు.. ఆమెను మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూయించగా బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆమెను విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగళవారం మహిళా సంఘాల సహాయంతో బాధితులు వరప్రసాద్‌ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా.. తనకేం సంబంఽధం లేదని చెప్పాడు. ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు, మహిళా సంఘాల నాయకులు అతడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. నిందితుడు వరప్రసాద్‌ను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి.. కేసు నమోదు చేసినట్టు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Updated Date - 2020-10-14T06:39:17+05:30 IST