బీజేపీలో చేరిన అనంతరం కేసీఆర్‌పై రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-07T20:05:10+05:30 IST

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన విజయశాంతి అలియాస్ రాములమ్మ కొద్దిసేపటి క్రితం...

బీజేపీలో చేరిన అనంతరం కేసీఆర్‌పై రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన విజయశాంతి అలియాస్ రాములమ్మ కొద్దిసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడిన రాములక్క తన రాజకీయ జీవితం, కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది..? అనే విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


కొన్ని కారణాల వల్ల..!

1998 జనవరి-26న బీజేపీలో నా రాజకీయ జీవితం ప్రారంభించాను. తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డాను. కొన్ని కారణాల వల్ల బీజేపీని వదిలి బయటకు వచ్చాను. 2005 మే నెలలో బయటకు వచ్చి తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీ నెలకొల్పాను. నా రాజకీయ జీతంలో అనేక అంశాలపై పోరాడాను. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదు.. ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో సీఎం కేసీఆర్ వ్యవహరించారు. పార్టీని విలీనం చేయమని నాపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారు. కేసీఆర్ కన్నా నేను ముందుగా తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చాను. కేసీఆర్‌ తన కుటుంబమే ఉద్యమంలో ఉండాలనుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరం ఎంపీలుగా గెలిచాం. 2013లో జూలైలో అదే రాత్రి నన్ను సస్పెండ్ చేశారు. ముందు నుంచే నాపై కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించారు. నేనే పార్టీ నుంచి బయటకు వెళ్లానని ప్రచారం చేశారుఅని కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు.


అవినీతి బయటపెడతా..!

‘ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పారు. కానీ చివరికి ఆయన యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో  కేసీఆర్ అందర్నీ ఆ పార్టీలో చేర్చుకున్నారు. కానీ.. ప్రస్తుతం తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. కేసీఆర్‌ను గద్దె దించుతాం.. ఆయన అవినీతిని బయటపెడతాను. తెలంగాణలో అత్యధికంగా అవినీతి జరుగుతోంది. రేపు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. విజయశాంతి ఎక్కడ ఉన్నా కీలక పాత్రే పోషిస్తుందిఅని రాములక్క చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-12-07T20:05:10+05:30 IST