రాంకీ ప్రతినిధులను అడ్డుకున్న కార్మికులు

ABN , First Publish Date - 2020-12-30T12:09:39+05:30 IST

రాంకీ ప్రతినిధులను అడ్డుకున్న కార్మికులు

రాంకీ ప్రతినిధులను అడ్డుకున్న కార్మికులు

హైదరాబాద్/కవాడిగూడ : పారిశుధ్య నిర్వహణలో ప్రైవేట్‌ సంస్థ జోక్యంపై క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చెత్త రవాణాకేంద్రాలను రాంకీకి అప్పగించాలన్న నిర్ణయాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తోన్న కార్మికులు మంగళవారం ఓ అడుగు ముందుకేశారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ వద్దకు వచ్చిన రాంకీ సంస్థ ప్రతినిధులను అడ్డుకున్నారు. లోనికి అడుగు పెట్టనిచ్చేది లేదని అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది తేల్చి చెప్పారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్మికులు, రాంకీ ప్రతినిధులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన రాంకీ ప్రతినిధులు తిరిగి వెళ్లిపోయారు.


జనవరి 1వ తేదీ నుంచి ట్రాన్స్‌ ఫర్‌ స్టేషన్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఆ సంస్థ ప్రతినిధులు వచ్చారని కార్మికులు ఆరోపించారు.  దశాబ్దాలుగా పని చేస్తోన్న తమ ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగేలా చెత్తరవాణాను ప్రైవేట్‌కు అప్పగించాలనే నిర్ణయం సమంజసం కాదని ప్రొఫెసర్‌ జయశంకర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. అనంతరం సంఘం అధ్యక్షుడు బల్వంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు గబ్బర్‌, ఇతర నాయకులు, కార్మికులు ఇందిరాపార్కులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ అప్పగింతకు సంబంధించి ఎలాంటి ఒప్పందం లేకున్నా.. రాంకీ సంస్థ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-12-30T12:09:39+05:30 IST