రంజాన్‌ వేళ.. తప్పిన కళ!

ABN , First Publish Date - 2020-05-24T09:24:49+05:30 IST

రంజాన్‌ మాసం.. ముస్లింలకు పవిత్రమైన మాసం. ఈ నెలంతా కఠినమైన నియమాలను..

రంజాన్‌ వేళ..  తప్పిన కళ!

  • షాపింగ్‌పై ఆసక్తి చూపని ముస్లింలు
  • వెలవెలబోతున్న ప్రధాన మార్కెట్లు

హైదరాబాద్‌ సిటీ/మదీన, మే 23 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసం.. ముస్లింలకు పవిత్రమైన మాసం. ఈ నెలంతా కఠినమైన నియమాలను అనుసరిస్తూ.. మత విశ్వాసాలను పాటిస్తూ.. గడిపే ముస్లింలు, భక్తి ప్రపత్తులతో రంజాన్‌ జరుపుకోవడంతో మాసాన్ని ఘనంగా ముగిస్తారు. రంజాన్‌ రోజు పేద, ధనిక తేడా లేకుండా అందరూ కొత్త దుస్తులతో పాటు అలంకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తుంటారు. రంజాన్‌కు ఓ వారం ముందు నుంచి కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. మార్కెట్లు కళకళలాడుతుంటాయి. పాతబస్తీలోనయితే ఈ నెలంతా పండగ వాతావరణమే కనిపిస్తుంటుంది. హోటళ్లు రాత్రంతా తెరిచి ఉంచి.. ఇఫ్తార్‌, సహెరీ వడ్డిస్తాయి. పాతబస్తీ వీధులన్నీ ఘుమఘుమలాడుతుంటాయి. 


ఖిచిడీ-ఖీమా, హలీమ్‌, పత్తర్‌ కా ఘోష్‌ లాంటి వంటకాలను తినేందుకు కులమతాలకు అతీతంగా అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఈ ఏడు లాక్‌డౌన్‌తో మార్కెట్లు మూగబోయాయి. కాంతులీనే చార్మినార్‌, మక్కామసీదు ప్రాంతం బోసిబోయింది. గాజుల తళుకులతో మెరిసే లాడ్‌బజార్‌ కళ తప్పింది. కోట్ల రూపాయల వ్యాపారం కరోనార్పణమైంది.



సడలింపులతో తెరుచుకున్న మార్కెట్లు

లాక్‌డౌన్‌ 4.0లో ఇచ్చిన సడలింపులతో రోజూ సాయంత్రం వరకు మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. అయినా షాపింగ్‌ చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే మదీనా మార్కెట్‌,  పత్తర్‌గట్టి,  గుల్జార్‌ హౌస్‌, లాడ్‌ బజార్‌, శాలిబండ, చార్మినార్‌, సుల్తాన్‌ బజార్‌, టోలిచౌకి, నాంపల్లి,  మల్లేపల్లి, సికింద్రాబాద్‌ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. చివరి రెండు మూడు రోజులైనా వ్యాపారం పుంజుకుంటుందని భావించిన వ్యాపారులకు ప్రస్తుత పరిస్థితి మింగుడుపడడం లేదు. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండడంతో జనం మార్కెట్ల వైపు చూసేందుకు కూడా జంకుతున్నారు. సాయంత్రం కర్ఫ్యూ అమల్లోకి వస్తుండడంతో షాపులు మూతపడుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడు షాపింగులు తగ్గించుకోవాలని మతపెద్దలు చేసిన సూచనలు కూడా ప్రజల ఆనాసక్తికి కారణంగా పలువురు భావిస్తున్నారు. పండుగ నమాజ్‌ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని మతపెద్దలు సూచిస్తున్నారు.   

 

అనాదిగా వస్తున్న సంప్రదాయం

అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. ఏటా రంజాన్‌ మాసంలో ధనికులు తమకున్న ఆస్తిలో రెం డున్నర శాతం పేదలకు పంచుతారు. రంజాన్‌ పర్వదినం రోజు ధనిక, పేద తేడా లేకుండా ప్రతి ముస్లిం కొత్త దుస్తులు ధరించాలని, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మహ్మద్‌ ప్రవక్త చేసిన సూచనలను అనుసరించి ఉన్నవాళ్లు, లేనివాళ్లకు పంచుతారు.


కుదేలైన కుటీర పరిశ్రమలు

రంజాన్‌ మాసం ప్రారంభమవడానికి ముందు నుంచే పాతబస్తీలోని కుటీర పరిశ్రమల్లో గాజులు, సేమ్యాల తయారీ ఊపందుకుంటుంది. తలాబ్‌కట్ట, నవాబ్‌సాబ్‌కుంట, యాకుత్‌పురా, డబీర్‌పురా, భవానీనగర్‌ పరిసర ప్రాంతాల్లోని చాలామంది తమ ఇళ్ళల్లోనే షీర్‌ఖుర్మాలో ఉపయోగించే సేమియాలు తయారు చేస్తుంటారు. లాడ్‌బజార్‌లో మెరిసే గాజులు కూడా పరిసర బస్తీల్లోనే తయార వుతుంటాయి. సరిగ్గా ఇదే సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌.. ఈ పరిశ్రమల నిర్వాహకుల పొట్టకొట్టింది.


షాపింగ్‌ చేయను

ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలమవుతోంది. రంజాన్‌ ప్రార్థనలు మసీదులో చేయలేకపోయిన బాధ కలచివేస్తోంది. ఇలాంటి తరుణంలో షాపింగ్‌ చేయాలనిపించడం లేదు. నా దగ్గర పనిచేస్తున్న కొంత మందికి మాత్రం కానుకలు ఇచ్చాను. నేను మాత్రం షాపింగ్‌ చేయను.

- మహమ్మద్‌ షరీఫ్‌,  చంద్రాయణగుట్ట 


అల్లా అనుగ్రహిస్తే వచ్చే ఏడాది..

ప్రస్తుతం ముస్లింలు చాలా బాధలో ఉన్నారు.  రంజాన్‌ మాసం గడిచిపోతున్నా ఆనందోత్సాహాలు లేవు.  కరోనా నుంచి ప్రపంచమంతా బయటపడి పరిస్థితి సానుకూలంగా మారితే వచ్చే ఏడాది  ఉత్సాహంతో పండగ జరుపుకుంటా.

- మహమ్మద్‌ జహంగీర్‌, ఫలక్‌నుమా

Updated Date - 2020-05-24T09:24:49+05:30 IST