రైతుబంధు డబ్బులొచ్చాయ్‌

ABN , First Publish Date - 2020-06-23T09:22:38+05:30 IST

రైతు బంధు డబ్బుల పంపిణీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. 50.84 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒక్క రోజులోనే రూ.5,294.53 కోట్లు జమ చేసింది. కొద్ది రోజులుగా ఈ మేరకు కసరత్తు చేస్తున్న

రైతుబంధు డబ్బులొచ్చాయ్‌

  • ఒక్క రోజే రూ.5,294 కోట్ల నిధులు చెల్లింపు
  • 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ
  • ఆరు ఎకరాల వరకు ఉన్నవారికి పంపిణీ
  • తెలంగాణ వ్యవసాయ శాఖ సరికొత్త రికార్డు


హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రైతు బంధు డబ్బుల పంపిణీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. 50.84 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒక్క రోజులోనే రూ.5,294.53 కోట్లు జమ చేసింది. కొద్ది రోజులుగా ఈ మేరకు కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ.. సోమవారం భారీగా చెల్లింపులు చేయడం విశేషం. ఈ వానాకాలం సీజన్‌లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున 1.40 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.7 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. ఇప్పటివరకు రూ.5,800 కోట్లు ఆర్థిక శాఖ నుంచి వ్యవసాయ శాఖకు బదిలీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 59 లక్షల మంది పట్టాదారుల్లో 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏక కాలంలో దాదాపు రూ.5,295 కోట్లు చేరాయి. మరో 5 లక్షల మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు సరిగా లేకపోవటం, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, రాంగ్‌ నంబర్లు ఉండటంతో పెండింగ్‌లో పెట్టారు. అందుబాటులో ఉన్న నిధులకు అనుగుణంగా స్ర్కీనింగ్‌ చేస్తే.. 6 ఎకరాల భూమి ఉన్న రైతుల వరకు చెల్లింపులు పూర్తవడం గమనార్హం. మిగిలిన రైతులకు కూడా ప్రాధాన్యత క్రమంలో చెల్లించే అవకాశాలున్నాయి.


బ్యాంక్‌ నుంచే సందేశం..

రైతుల జాబితా వడపోత తర్వాత వ్యవసాయ శాఖ ఖాతాలో ఉన్న డబ్బును రంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపారు. అక్కడినుంచి రైతుల ఖాతాలు, విస్తీర్ణంవారీగా జమ చేయాల్సిన మొత్తం లెక్క తీసి రిజర్వు బ్యాంకుకు సమర్పించారు. రిజర్వు బ్యాంక్‌ ‘ఈ- కుబేర్‌’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమయ్యాయి. సోమవారం సాయంత్రానికే బ్యాంకు నుంచి మెసేజ్‌ వచ్చింది. రెండు రోజుల్లో వ్యవసాయశాఖ నుంచి కూడా టెక్ట్స్‌ మెసేజ్‌ వెళ్లనుంది. గతంలో వ్యవసాయ శాఖ నుంచి రైతుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెళ్లినా.. ఖాతాలో డబ్బు జమ కాని సందర్భాలున్నాయి. ఇప్పుడు అందుకు భిన్నంగా తొలుత బ్యాంక్‌ నుంచే మెసేజ్‌ వస్తుండటం విశేషం. రైతుబంధు పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సకాలంలో చెక్కులు అందాయి. తర్వాత మూడు విడతల్లో డబ్బుల మంజూరు, పంపిణీలో జాప్యం జరిగింది. ఈసారి అలాకాకుండా ఒక్క రోజులోనే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. వీరిలో ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాదారులైన 63,477 మంది రైతులు కూడా ఉన్నారు. వీరికి రూ.82.37 కోట్లు పంపిణీ చేశారు. బ్యాంకు వివరాలు సమగ్రంగా ఉన్న రైతులకు ఒకే రోజులో చెల్లించేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి డా.బి.జనార్దన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 6 ఎకరాల కేటగిరీలో ఉన్న రైతుల వరకు చెల్లింపులు పూర్తయ్యాయని, మిగిలిన రైతులకు కూడా ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని చెప్పారు.


జూన్‌ 16వరకు పాస్‌బుక్‌లు వచ్చినవారికి..

ఈ నెల 16 వరకు పాస్‌ పుస్తకాలు జారీచేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రికార్డుస్థాయి లో ఒకేరోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5,294.53 కోట్లు జమ చేశామన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. రైతుబంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని, కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకునే వ్యవసాయ అనుకూల విధానాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఎన్‌ఐసీ సిబ్బందిని మంత్రి అభినందించారు.


గంటకు 3 లక్షల ఖాతాల్లో జమ

రైతు బంధు నగదు జమకు ఆర్బీఐ ఈ-కుబేర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి ప్రతి గంటకు దాదాపు 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమవుతోందని అన్నారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతులకు సాయం చేసి.. ప్రభుత్వం  నిబద్ధతను నిరూపించుకుందని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-06-23T09:22:38+05:30 IST