వర్షపాతం 44 శాతం అధికం

ABN , First Publish Date - 2020-08-20T09:08:45+05:30 IST

ఈ వానాకాలంలో ఇప్పటివరకు వర్షపాతం సాధారణం కంటే 44 శాతం అధికంగా

వర్షపాతం 44 శాతం అధికం

  • 1.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలు
  • ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఈ వానాకాలంలో ఇప్పటివరకు వర్షపాతం సాధారణం కంటే 44 శాతం అధికంగా నమోదైంది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ బుధవారం సమర్పించింది. ఏ ఒక్క జిల్లాలోనూ లోటు వర్షపాతం లేకపోవటం విశేషం. రాష్ట్రంలో 25 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ(20 శాతం కంటే అధికం) వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొంది. కాగా, సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 120 శాతం విస్తీర్ణంలో వానాకాలం పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1,03,47,715 ఎకరాలుండగా ఇప్పటివరకు 1,23,86,920 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వరి సాధారణ విస్తీర్ణం 27,25,058 ఎకరాలు ఉండగా ఈ సీజన్‌ లో ఇప్పటికే 44,75,827 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. పత్తి పంట సాధారణ విస్తీర్ణం 44,50,029 ఎకరాలు ఉండగా 58,63,244 ఎకరాల్లో సాగు చేశారు.


అంటే 132 శాతం పత్తి సాగైంది. కంది 10,32,155 ఎకరాల్లో(136 శాతం), సోయాబీన్‌ 3,89,055(80 శాతం) సాగైంది. మొక్కజొన్న పంట వానాకాలం సీజన్‌లో వేయొద్దని చెప్పినప్పటికీ 2.03 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. అన్ని ఆహార ధాన్యాలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం 50,85,077 ఎకరాలు ఉండగా... 60,19,510 ఎకరాల్లో(118 శాతం) సాగు కావటం విశేషం. ఇందులో పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10,56,114 ఎకరాలు కాగా... 12,36,894 ఎకరాల్లో(117 శాతం) ఇప్పటివరకు సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొంది.


చీడపీడల బెడద

వరి, పత్తి, కంది వంటి ప్రధాన పంటలకు చీడపీడల బెడద ఉన్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. వరి పంటకు కాండం తొలిచే పురుగు పట్టుకుంది. నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కాండంతొలిచే పురుగు ప్రభావం ఉంది. పత్తి పంటకు కాండం కుళ్లు తెగులు, రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో  వీటిని గుర్తించారు. మొక్కజొన్నను కత్తెర పురుగు ఇబ్బంది పెడుతోంది. మెదక్‌ జిల్లాలో కంది పంటకు పేనుబంక సోకినట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి, నివేదికలో పొందుపరిచారు. 

Read more