యాదాద్రి క్షేత్రంలో క్యూ కాంప్లెక్స్ !
ABN , First Publish Date - 2020-07-27T08:38:45+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ ప్రధానాలయ, ప్రాకార మండపాల పనులు పూర్తి కావొస్తుండటంతో భక్తులకు దర్శనాలు, ఇతర మౌలిక

- ఏర్పాటుకు అధికారుల కసరత్తు
- భక్తులకు సులభ దర్శనం, సౌలభ్యతకు ప్రాధాన్యం
- బస్ టర్మినల్ నుంచి శాశ్వత క్యూ కాంప్లెక్స్
యాదాద్రి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ ప్రధానాలయ, ప్రాకార మండపాల పనులు పూర్తి కావొస్తుండటంతో భక్తులకు దర్శనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. స్వామివారి దర్శనానికి భక్తుల క్యూ కాంప్లెక్స్ ఏర్పాటుకు వైటీడీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు సులభంగా గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనువుగా ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. ఈ మేరకు అధికారుల బృందం శనివారం కొండపై క్యూ కాంప్లెక్స్ ముసాయిదా ప్లాన్ ప్రకారం క్షేత్రస్థాయిలో స్థల సౌలభ్యతను పరిశీలించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంప్లెక్స్‌లో సీటింగ్ ఏర్పాట్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రధానాలయ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆలయం బయటి పనుల్లో వేగం పెంచారు.
కొండపై పుష్కరిణి నుంచి...
భక్తులు యాదాద్రి కొండపై ఉత్తర ఈశాన్య దిక్కున ఉన్న పుష్కరిణి వద్దకు తొలుత చేరుకోవల్సి వుంటుంది. పుష్కరిణి నుంచి శాశ్వత క్యూ కాంప్లెక్‌ను ప్రసాదాల కాంప్లెక్ భవనం మీదుగా ఆలయ మాఢవీధుల గుండా ఆలయ ప్రాకారాలు దాటుకుని ఉప ఆలయాలు, గర్భాలయం వరకు ఏర్పాటు చేయాలనేది అధికారుల ప్రతిపాదన. అయితే అవసరమైనప్పుడు కదిలించే సౌలభ్యం ఉండేలా వీల్స్‌తో కూడిన మూవబుల్ (చలన) క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా ప్రధానాల ముఖ మండపం నుంచి గర్భాలయంలోకి భక్తులు ప్రవేశించేందుకు, దర్శనం అనంతరం బయటికి వచ్చేందుకు వీలుగా పది అడుగుల వెడల్పుతో క్యూలైన్ ఏర్పాటును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ రెండు మార్గాలకు మధ్యలో అర్చకుల ప్రవేశానికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ఎస్కలేటర్
అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులకు సౌలభ్యంగా ఎస్కలేటర్ ఏర్పాటుకు కూడా అధికారులు యోచిస్తున్నట్టు ఆలయ వర్గాల ద్వారా తెలిసింది. దసరా నాటికి ఆలయ నిర్మాణం పూర్తికావాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబరులోగా భక్తుల క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయాలని వైటీడీఏ అధికారులు భావిస్తున్నారు.