ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-06-18T09:33:32+05:30 IST

ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

  • కేకే నేతృత్వంలో కమిటీ

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆయన ేసవలను ఘనంగా స్మరించుకోవడానికి శతజయంతి వేడుకలను గొప్పగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పీవీ మన ఠీవీ అని గొప్పగా చెప్పుకునేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. పీవీ జయంతి జూన్‌ 28 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని బుధవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా, దేశ ప్రధానిగా, సాహితీవేత్తగా ఆయన బహువిధాలుగా దేశానికి ేసవలు అందించారని కేసీఆర్‌ శ్లాఘించారు. అంత గొప్ప వ్యక్తి తెలంగాణ వాడు కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు.


కాగా, పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం సీనియర్‌ పార్లమెంటు సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని సీఎం నియమించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవి, కరీంనగర్‌ జిల్లా మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో ఆరేడుగురిని కూడా కమిటీలో చేర్చుకోవాలని కేశవరావును కేసీఆర్‌ కోరారు. కేశవరావు నివాసంలో గురువారం మధ్యాహ్నం రెండున్నరకు ఈ కమిటీ తొలి భేటీ జరుగుతుంది. పీవీ కుటుంబ సభ్యులను సంప్రదించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన జరగాలని కమిటీ సభ్యులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. 

Updated Date - 2020-06-18T09:33:32+05:30 IST