దమ్ముంటే మా పొలాల్లో కాలు పెట్టండి
ABN , First Publish Date - 2020-06-25T08:08:52+05:30 IST
మీకు దమ్ముంటే మా పొలాల్లో కాలు పెట్టండి. మీ అటవీ భూములు ఎక్కడున్నాయి?’’ అంటూ తెలంగాణ అటవీశాఖ అధికారులను కర్ణాటక రైతులు తీవ్ర స్థాయిలో

తెలంగాణ అటవీ అధికారులకు
కర్ణాటక రైతుల హెచ్చరిక
డీఎఫ్‌వో ఎదుటే సిబ్బందిపై దౌర్జన్యం
బషీరాబాద్, జూన్ 24: ‘మీకు దమ్ముంటే మా పొలాల్లో కాలు పెట్టండి. మీ అటవీ భూములు ఎక్కడున్నాయి?’’ అంటూ తెలంగాణ అటవీశాఖ అధికారులను కర్ణాటక రైతులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తమ ప్రభుత్వం పట్టా పాస్‌పుస్తకాలు ఇచ్చిందని, ఏటా తమను పంట సాగు చేయకుండా అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని అక్కడి రైతులు వికారాబాద్ డీఎ్‌ఫవో వేణుమాధవ్ ఎదుటే బెదిరింపులకు దిగారు. ఈ సంఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగింది. నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్ అటవీ ప్రాంతంలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు సిబ్బంది గుంతలు తీయిస్తున్న ప్రాంతాన్ని డీఎ్‌ఫవో (జిల్లా అటవీశాఖ అధికారి) పరిశీలించారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో కర్ణాటక రైతులు గత కొన్నేళ్లుగా సుమారు 500 ఎకరాలు తెలంగాణ అటవీ పరిధిలోకి చొచ్చుకొచ్చి పంటలు సాగుచేస్తుండగా అధికారులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో విత్తనాలు విత్తుతుండడం చూసి డీఎ్‌ఫవో అక్కడున్న తాండూరు అటవీ క్షేత్ర అధికారి (రేంజర్) శ్యాంసుందర్‌రావును ఆరాతీశారు. పంటసాగును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా వినడం లేదని కర్ణాటక రైతుల తీరును ఆయన వివరించారు. దీంతో కొందరు కర్ణాటక రైతులు అఽధికారులతో గొడవకు దిగడమే కాకుండా తీవ్రంగా దూషించారు. దీంతో అటవీ శాఖ సెక్షన్ అధికారి ఎండీ అన్వర్‌హుస్సేన్ ఖాన్ ‘ఎవరేం చేస్తారో చూస్తా పదండి’ అంటూ పొలాల్లోకి పరుగుపెట్టారు. రైతులు పెద్దపెట్టున అరుస్తూ వెంబడి వెళ్లడంతో పరిస్థితి కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉమ్మడి సర్వే అయ్యే దాకా పంట సాగుచేస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కర్ణాటక రైతులను అధికారులు హెచ్చరించి పంపించారు.