‘కంది’పోతున్నారు..!

ABN , First Publish Date - 2020-04-18T09:02:17+05:30 IST

రైతులకు ‘లాక్‌డౌన్‌’ గుదిబండగా మారింది.. ఉత్పత్తులు విక్రయించి రోజులు గడుస్తున్నా..

‘కంది’పోతున్నారు..!

కందులు విక్రయించి నెల రోజులైనా అందని డబ్బులు

రైతులకు రావల్సింది రూ.4.5 కోట్లు.. లాక్‌డౌన్‌తో అందని రొక్కం


స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 17 : రైతులకు ‘లాక్‌డౌన్‌’ గుదిబండగా మారింది.. ఉత్పత్తులు విక్రయించి రోజులు గడుస్తున్నా.. చేతికి రొక్కం అందని దుస్థితి నెలకొంది.. స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌లో కందులు విక్రయించిన కర్షకులకు డబ్బులు రాక పడరానిపాట్లు పడుతున్నారు. 


మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఓరుగల్లు జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (ఓడీసీఎంఎస్‌) యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని జనవరి 10వ తేదీన ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 20వరకు కందులను రైతుల ద్వారా కొనుగోళ్లు చేశారు. అయితే అకాలవర్షాలతో సేకరణలో కొంత జాప్యం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర క్వింటాకు రూ. 5,800 రైతుల నుంచి కొన్నారు.


వారం, పది రోజుల్లో డబ్బులు బ్యాంకు అకౌంట్లలో వేస్తారని చెప్పినా.. ఇప్పటి వరకు ఎవరికీ జమకాలేదు. కాగా, డబ్బులు అకౌంట్లలో వేస్తారని ఆశగా ఎదురు చూస్తుండగా హఠాత్తుగా కరోనా వైరస్‌ విస్తృతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఈ నిర్ణయం కర్షకులకు ఆశనిపాతంగా మారింది. ఇప్పటి వరకు ఒక్క రైతుకూ డబ్బులు జమ కాకపోవడంతో మార్కెట్‌ యార్డు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది మార్కెటింగ్‌ శాఖ కిందకు రాదని, డబ్బులు మార్క్‌ఫెడ్‌ వారు రైతుల అకౌంట్లలో వేస్తారని పేర్కొంటున్నారు.


రూ4.5 కోట్లు..

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సుమారు 40 రోజులపాటు ఓడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లు నిర్వహించారు. మొత్తం 1170 మంది రైతుల నుంచి 15,660 బస్తాలు అనగా 7800 క్వింటాళ్ల కందులు రూ. 5800ల చొప్పున కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.4 కోట్ల 50 లక్షలు అన్నదాతల అకౌంట్లలో జమ కావలసి ఉంది. ఈ క్రమంలో ఎవరికీ ఇప్పటి వరకూ డబ్బులు జమ కాకపోవడంతో కంది రైతులు రంది పడుతున్నారు. వారం, పది రోజుల్లో డబ్బులు అకౌంట్లలో పడతాయని చెప్పినా.. ఇంత జాప్యమైతే అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు.


 రైతులు అధైర్యపడొద్దు..- ఎ.స్వర్ణలత, స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌

కంది రైతులు అధైర్య పడొద్దు, కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలోనే డబ్బులు కేంద్రం నుంచి విడుదల కాలేదని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల కూడా సమస్య ఎదురై ఉండవచ్చు. కేంద్రం నాఫెడ్‌ నుంచి మార్క్‌ఫెడ్‌కు విడుదల అవుతాయి. వారు రైతుల అకౌంట్లలో వేస్తారు. అకౌంట్లలో జమ కాకుండా మార్కెట్‌ సిబ్బంది కారణమని రైతులు అపోహ పడుతున్నారు. దానిలో నిజం లేదు. రైతులు ఆందోళన చెందొద్దు, లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే డబ్బులు పడే అవకాశం ఉంది.

Updated Date - 2020-04-18T09:02:17+05:30 IST