‘సాగర్‌’ పోరుకు సై!

ABN , First Publish Date - 2020-12-28T09:19:34+05:30 IST

రాష్ట్రంలో రాజకీయ పోరుకు రంగం సిద్ధమవుతోంది. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే నోముల

‘సాగర్‌’ పోరుకు సై!

ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా ఉప ఎన్నిక

నియోజకవర్గానికి తరచూ మంత్రి జగదీశ్‌

ఆసక్తి రేపుతున్న టీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసు

కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత జానారెడ్డి

లేదంటే ఆయన తనయుడు రఘువీర్‌ పోటీ

అభ్యర్థిని తేల్చకుండానే బీజేపీ ప్రచారం 


హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ పోరుకు రంగం సిద్ధమవుతోంది. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో రానున్న ఆరు నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ సాగర్‌ పైనే కేంద్రీకృతమైంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ.. గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరాభవం దరిమిలా సాగర్‌లో విజయం అధికార టీఆర్‌ఎ్‌సకు అత్యవసరంగా మారింది. దుబ్బాక, గ్రేటర్‌ ఓటమి మచ్చ మాసిపోయేందుకు సాగర్‌లో గెలిచి తీరాలనే పట్టుదల ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పరంగా ఆ నియోజకవర్గానికి ఇటీవల నిధులు మంజూరు చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలయ్యేలోపు అక్కడ వరుస పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరోవైపు దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో గెలుపు ఇచ్చిన ఊపుతో సాగర్‌లోనూ కాషాయ జెండా ఎగరేయాలనే ఉత్సాహాన్ని బీజేపీ ప్రదర్శిస్తోంది. అక్కడ ఆ పార్టీకి అంతగా పట్టు లేనప్పటికీ.. వరుస విజయాల పరంపర కొనసాగిస్తామనే ధీమాను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అభ్యర్థి ప్రస్తావన లేకుండానే నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. ఇక 2014 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నుంచి ఓటమికి చిరునామాగా మారిన కాంగ్రెస్‌.. సాగర్‌లో గెలిచి ఊరట పొందాలని భావిస్తోంది. నోముల నర్సింహయ్య అనారోగ్యంతో బాధ పడటానికి ముందు నుంచే జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి నియోజకవర్గంలో తమ పర్యటనలు పెంచారు.


వారసుడా? కొత్త అభ్యర్థా?

సర్వశక్తులూ ఒడ్డేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కీలకం కానుందని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు, న్యాయవాది నోముల భగత్‌యాదవ్‌ ఆశిస్తున్నారు. పార్టీ నేత ఎం.సి.కోటిరెడ్డి కూడా టికెట్‌ రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు అదే నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత, హైకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్‌ మనవడు మన్నెం రంజిత్‌యాదవ్‌.. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తూ సీఎం కేసీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఒక రహస్య సర్వే చేయించినట్లు సమాచారం. అయితే 2014లో తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో సిటింగ్‌ ఎమ్మెల్యేలు చనిపోయిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చిన ప్రయోగం కాంగ్రెస్‌ (నారాయణఖేడ్‌, పాలేరు), టీఆర్‌ఎస్‌ (దుబ్బాక) రెండింటి విషయంలోనూ సఫలం కాలేదు. దీంతో సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.


కాంగ్రె్‌సలో జానారెడ్డి మాట మేరకే

సాగర్‌ ఉప ఎన్నిక విషయంలో జానారెడ్డిని కాదని టీపీసీసీ, ఏఐసీసీ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్‌ తరఫున జానారెడ్డి స్వయంగా పోటీ చేస్తే మంచిదని, రఘువీర్‌రెడ్డిని పోటీలో పెట్టినా అభ్యంతరం లేదని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. 


‘కమలం’ గుర్తు ఎవరికి ?

కంకణాల నివేదితా రెడ్డి, గోన విష్ణువర్ధన్‌రావు బీజేపీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. 


యాదవులు, ఎస్టీలే కీలకం..

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవులు, ఎస్టీలు ఉప ఎన్నికలో కీలకం కానున్నారు. వీరి తర్వాత ముదిరాజ్‌, షెడ్యూల్‌ కులాల వారు ఎక్కువ మంది ఉంటారు. మొత్తం ఓటర్లు దాదాపు 2లక్షల మంది ఓటర్లు ఉండగా.. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.జానారెడ్డి 42.72 శాతం ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 16,780 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి 17.08 శాతం ఓట్లు సాధించింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య 46.34 శాతం ఓట్లతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి కె.జానారెడ్డిపై 7,771 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నివేదిత ఈ ఎన్నికల్లో కేవలం 1.48 శాతం ఓట్లు మాత్రమే సాధించారు.

Updated Date - 2020-12-28T09:19:34+05:30 IST