మా ప్లాట్లపై మంత్రి, మేయర్ కన్నేశారు!
ABN , First Publish Date - 2020-12-28T07:52:05+05:30 IST
అవి పాతికేళ్ల కిందట కొన్న ప్లాట్లు.. అప్పట్లో గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్ అనుమతులు తీసుకున్నారు.. ఇళ్ల నిర్మాణాలకు పర్వతాపూర్ పంచాయతీ అనుమతులూ తీసుకున్నారు.. అనంతరం కొన్ని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ రుసుము కూడా చెల్లించారు..

మల్లారెడ్డి, వెంకట్‌రెడ్డి కుమ్మక్కై కబ్జాకు కుట్ర
వారి నుంచి మా స్థలాన్ని రక్షించండి
25 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు ప్రభుత్వ భూమిట
ప్లాట్లు మాకు దక్కాలంటే డబ్బులు ఇవ్వాలట!
మేడిపల్లి సాయిప్రియ లేఅవుట్ ప్లాట్ల ఓనర్లు
ఉప్పల్/పీర్జాదిగూడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అవి పాతికేళ్ల కిందట కొన్న ప్లాట్లు.. అప్పట్లో గ్రామపంచాయతీ నుంచి లేఅవుట్ అనుమతులు తీసుకున్నారు.. ఇళ్ల నిర్మాణాలకు పర్వతాపూర్ పంచాయతీ అనుమతులూ తీసుకున్నారు.. అనంతరం కొన్ని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ రుసుము కూడా చెల్లించారు.. ఏళ్లు గడిచిన తర్వాత తాజాగా ఆ లేఅవుట్‌లో ప్రభుత్వ భూమి ఉందంటూ అధికారులు వచ్చారు. పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి చొరవతో రెవెన్యూ అధికారులు ఆర్నెల్ల కిందట కొంత స్థలం చుట్టూ కంచె వేశారు.
అప్పటి నుంచి వివాదం మొదలైంది. ఖాళీ ప్లాట్లు కనిపించడంతో మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్‌రెడ్డి కన్ను పడిందని.. తమ ప్లాట్లను కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇదీ పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో ఉన్న సాయిప్రియ లేఅవుట్‌లో పరిస్థితి. లేఅవుట్‌లోని కొంత స్థలంలో డంపింగ్ యార్డ్ కోసమంటూ రెవెన్యూ, మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకుంటుండడంతో ప్లాట్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. తమ స్థలాలపై అధికారులు కన్నేశారంటూ ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినా పట్టించుకున్న నాథుడే లేకపోయారని వాపోతున్నారు. మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డికి ఎన్ని సార్లు మె చెప్పినా ఫలితం లేకపోయిందని ప్లాట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి, మేయర్ కుమ్మక్కయ్యారు..
25 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు ఇంకా ఖాళీగా ఉండడంతో మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్‌రెడ్డి కన్ను పడిందని ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు. భూమిని ఎలాగైనా కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే ఆ లేఅవుట్‌లో ప్రభుత్వ భూమి ఉందంటూ కొత్త నాటకానికి తెరలేపి తమతో బేరసారాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తమ ప్లాట్ల చుట్టూ వేసిన కంచెను తొలగించాలని ఆరు నెలలుగా విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయిప్రియా లేఅవుట్‌లోని ప్లాట్ల యజమానులు ఆందోళనకు దిగారు. ప్లాట్లకు వేసిన కంచెను తొలగించాలని మంత్రి మల్లారెడ్డిని కలిస్తే.. మేయర్ వెంకట్‌రెడ్డిని కలవాలని చెబుతున్నారని, మేయర్‌ను కలిస్తే మంత్రిని కలవమని చెబుతున్నారని.. తమ ప్లాట్లను కాజేసేందుకు పెద్ద కుట్ర పన్నారని వారు ఆరోపించారు. మంత్రిని కలిస్తే ఎవరి ప్లాట్లు వారికే ఉంటాయని చెబుతూనే లేఅవుట్ చేసిన యజమాని నుంచి ఎంతో కొంత రాబట్టేందుకు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగా లేఅవుట్ చేసిన సుఖేందర్‌రెడ్డిపై కేసు పెట్టాలని సూచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడెలా ప్రభుత్వ భూమి అయ్యింది
గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ భూమి కానిది ఇప్పుడెలా ప్రభుత్వ భూమిగా మారిందో అధికారులు, ప్రజాప్రతినిధులే చెప్పాలని ప్లాట్ల యజమానులు ప్రశ్నించారు. తమ ప్లాట్లకు కంచె వేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మరోవైపు ఒక్కొక్క ప్లాటు యజమాని 100 గజాల స్థలం ఇవ్వాలని, లేదంటే ప్లాటుకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్‌రెడ్డి మనుషులమని చెబుతూ కొందరు బేరసారాలు ఆడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల్లోని కొన్ని లొసుగులను అడ్డుపెట్టుకొని ప్లాట్ల యజమానులు, లేఅవుట్ యజమాని నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమ ప్లాట్లు తమకు అప్పగించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఈ నిరసనలో సాయిప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ మహేందర్, ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్, యాదగిరి, రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి జక్కా దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
33 ఎకరాలు ప్రభుత్వ భూమి: కమిషనర్
సాయిప్రియ లేఅవుట్ వివాదంపై పీర్జాదిగూడ మునిసిపల్ కమిషనర్‌ను సంప్రదించగా లేఅవుట్ సమీపంలోని సర్వే నంబరు 10, 11లో 33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. ఆ స్థలాన్ని 8 నెలల క్రితం కలెక్టర్ తమకు అప్పగించగా ఫెన్సింగ్ వేశామని తెలిపారు. అయితే 1982లో అప్పటి ప్రభుత్వం శ్రీరమణ హౌసింగ్ సొసైటీకి స్థలాన్ని అమ్మేసిందని, మ్యాప్‌లను జరిపి తమ స్థలాలను ప్రభుత్వ భూమిగా చూపుతున్నారని సాయిప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జక్కా దయాకర్‌రెడ్డి చెప్పారు.