చేసుకున్న పాపం అనుభవించాలి

ABN , First Publish Date - 2020-07-14T08:17:17+05:30 IST

ఎవరు చేసుకున్న పాపం వారు అనుభవిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని

చేసుకున్న పాపం అనుభవించాలి

  • రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి
  • ఐదు వారాలు సాక సమర్పించాలి
  • భవిష్య వాణిలో అమ్మవారు

రాంగోపాల్‌పేట్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎవరు చేసుకున్న పాపం వారు అనుభవిస్తున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని.. జాగ్రత్తగా ఉండాలంటూ అమ్మవారు భవిష్యవాణి వినిపించింది. ఆషాఢ బోనాల జాతరలో భాగంగా రెండో రోజు సోమవారం సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానంలో మాతాంగేశ్వరి ముందు తంబూర చేత పట్టుకుని పచ్చికుండపై నిల్చున్న స్వర్ణలత అమ్మవారు ఆవహించగ భవిష్యవాణిని వినిపించారు. ‘ఎక్కడినుంచో వచ్చిన కరోనా కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భక్తులు నిన్న తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభించారు. వారిని కాపాడు’ అంటూ చండీ పారాయణులువేణుమాధవ శర్మ అమ్మవారిని వేడుకున్నారు. దీంతో ‘కామం, ద్వేష భావంతో పూజలు నిర్వహించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే నా బిడ్డలను నేనే కాపాడుకుంటా. ప్రజలు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. భక్తులు లేకుండా జరిగిన ఈ బోనాలతో నేను సంతోషంగా లేను. ప్రతి గడప నుంచి ఐదు వారాల పాటు సాక పెట్టి పప్పుబెల్లంతో ఫలహారం తెచ్చి సమర్పించాలి. యజ్ఞ హోమాలను నిర్వహించాలి’ అని అమ్మవారు సూచించింది. తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రయత్నాన్ని ఆశీర్వదించమని కోరగా.. గంగమ్మకు యజ్ఞయాగాదులు, హోమాలు చేస్తే తప్పక కోరిక నెరవేరుతుందన్నారు. భవిష్యవాణి అనంతరం పోతరాజులు సొరకాయ, గుమ్మడికాయ బలితీసి, గావు పట్టి విన్యాసాలు చేశారు.

Updated Date - 2020-07-14T08:17:17+05:30 IST