ఆస్తుల ఆన్‌లైన్‌

ABN , First Publish Date - 2020-09-29T06:47:02+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణల్లో భాగంగా అమలుచేస్తున్న వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సోమవారం

ఆస్తుల ఆన్‌లైన్‌

పల్లెల్లో ప్రారంభమైన వివరాల సేకరణ

ఇళ్లు, ప్లాట్లు నమోదు చేయించుకుంటున్న జనం

స్వీయ ధ్రువీకరణ పత్రాల పంపిణీ

స్వయంగా సమర్పించాలంటున్న అధికారులు

చట్టబద్ధత కోసం తప్పనిసరి అని హెచ్చరికలు


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా: 

రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణల్లో భాగంగా అమలుచేస్తున్న వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. ప్రతీ ఒక్కరు తమకున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, వారికి మెరున్‌ రంగు పాస్‌పుస్తకాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రజల వ్యవసాయేతర ఆస్తుల వివరాల సేకరణ కోసం కార్యదర్శులు రంగంలోకి దిగారు. ప్రధానంగా పాత ఇళ్లతో పాటు కొత్తగా నిర్మించుకుని గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదు కాని ఇళ్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ కొన్నిచోట్ల కొత్తగా నిర్మించుకున్న ఇళ్ల యజమానుల పేరు, ఇంటి నంబర్‌, మరుగుదొడ్డి, కుటుంబ సభ్యులందరి పేర్లు, యజమానితో గల సంబంధం వారి ఆధార్‌, ఫోన్‌ నంబర్ల వివరాలను రికార్డులో నమోదు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామపంచాయతీల్లో ఆధార్‌కార్డుతో ఇంటి యజమానులు కార్యాలయానికి వచ్చి స్వీయధ్రువీకరణ ద్వారా వివరాలు అందజేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఫార్మాట్‌ను కూడా సిద్ధం చేసి అందులో యజమానుల సంతకాలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల పాత ఇళ్ల సమాచారం కూడా నమోదు చేసుకుంటున్నారు. 


కొందరు గ్రామపంచాయతీ కార్యదర్శులు సొంతంగా ప్రొఫార్మాలను తయారు చేయించుకొని ఇంటి యజమానుల వివరాలను క్షేత్రస్థాయిలో రాసుకొని ఆ తర్వాత కార్యాలయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సమగ్ర వివరాలను సేకరిస్తుండడంతో భవిష్యత్తులో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల మంజూరు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, ఇంటిపన్నుల లెక్కింపు, వారసత్వంగా పేరు మార్పిడి వంటివి సులువవుతాయని గ్రామపంచాయతీ అధికారులు చెబుతున్నారు. 


కొన్ని గ్రామాల్లో దండోరా వేయించి రెండు రోజుల్లో వివరాల పత్రం సమర్పించకపోతే  ఆ తర్వాత తీసుకోబోమని అధికారులు ప్రకటిస్తున్నారు. గ్రామ పంచాయతీల పేరిట ప్రత్యేకంగా ప్రొఫార్మా తయారు చేసి గ్రామ వాట్సప్‌ గ్రూపుల్లో కార్యదర్శులు షేర్‌ చేస్తున్నారు. గ్రామంలో ఇళ్లు ఉండి ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు వెంటనే తమ పత్రాలను సమర్పించాలని కోరుతున్నారు. దరఖాస్తుదారుడి ఫొటో, సంతకంతో కూడిన పత్రాలనే తీసుకుంటామని గ్రామ కార్యదర్శులు స్పష్టం చేస్తున్నారు. ధరణిలో ఇళ్ల నమోదుకు కేవలం రెండు రోజులే గడువంటూ ప్రచారం చేస్తుండడంతో యజమానులు తమ పత్రాలను గ్రామపంచాయతీల్లో సమర్పిస్తున్నారు.


ప్రజలు తమ ఆస్తులను ఆన్‌లైన్‌ చేయాలంటే 2020 వరకు ఎలాంటి ఇంటి, నల్లా పన్ను బాకాయిలు ఉండొద్దని అధికారులు తెలుపుతున్నారు. భవిష్యత్‌లో ఏ పని చేయాలన్నా ఆస్తుల నమోదు పత్రమే కీలకంగా ఉంటుందని చెబుతుండటంతో గ్రామాల్లో  ప్రజలు ఆందోళనతో ఆన్‌లైన్‌ చేసుకుంటున్నారు.  ఇళ్లకు సరైన పత్రాలు లేనివారికి ఇది మంచి అవకాశమని గ్రామపంచాయతీ సిబ్బంది పేర్కొంటున్నారు. తాతల కాలం నాటి ఇళ్లను తమ పేరిట నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్‌లో అమ్మడం, కొనడం సులువవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇదే చివరి అవకాశమంటూ గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. 


అక్టోబరు 10లోపు ప్రజల వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించి ఆయా గ్రామ పంచాయతీల్లో జాబితాను ప్రదర్శించనున్నారు. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించనున్నారు. తప్పొప్పులు ఉంటే సరి చేస్తారు. అనంతరం ధరణి పోర్టల్‌లో ప్రతీ గ్రామంలోని ప్రతీ ఒక్కరి ఆస్తి వివరాలు నమోదు చేస్తారు.  


మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా నాలుగు మునిసిపాలిటీల పరిధులను మినహాయించి అన్ని గ్రామపంచాయతీల్లో సిబ్బంది వివరాల సేకరణ ప్రారంభించారు. జిల్లాలో 461 గ్రామపంచాయతీల్లో రికార్డుల ప్రకారం 6,54,404 మంది జనాభా ఉండగా ఇప్పటికే 1,74,950 ఇళ్లు నమోదై ఉన్నాయి. ఇప్పటివరకు 15,306 కొత్త ఇళ్లను గుర్తించగా 2,095 ఇళ్లను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో చేసిన ఇళ్లను కలుపుకొని 1,77,045 ఇళ్లు నమోదై ఉన్నాయి. 


జనగామ జిల్లాలో అధికారులు వ్యవసాయేతర ఆస్తుల సర్వేను మొదలుపెట్టారు. జనగామ పట్టణంలోని 30 వార్డులకు గానూ ఒక్కో వార్డుకు ఒకరి చొప్పున సిబ్బందిని నియమించి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా 48 అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు. ఇంటి, నల్లా పన్ను, విద్యుత్‌ బిల్లు, ఇంటి యజమాని ఫొటో, ఆస్తికి సంబంధించిన పత్రాలు, ఆహారభద్రతా కార్డు, జనధన్‌ ఖాతా వివరాలు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, పింఛన్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటున్నారు. పట్టణ వ్యాప్తంగా 12,406 ఆస్తులను సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 665 ఆస్తుల వివరాలను సేకరించారు.  జనగామ జిల్లావ్యాప్తంగా  1.50 లక్షల వరకు ఆస్తులు ఉండొచ్చని పంచాయతీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రజలు నేరుగా గ్రామపంచాయతీకి వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటే ఆన్‌లైన్లో  ఉచితంగానే నమోదు చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తెలిపారు. 


ములుగు జిల్లాలోనూ వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఖాళీ స్థలాలు, పంచాయతీ రికార్డుల్లో లేని ఇళ్లతోపాటు పశువుల కొట్టాలు, ఇతర నిర్మాణాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వీటికి ప్రత్యేక నెంబర్లు కేటాయించనున్నారు. గతంలోనే కొన్ని గ్రామాల్లో ఆస్తుల వివరాల నమోదు జరగగా మిగతా పంచాయతీల్లో రెండురోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 


వరంగల్‌ రూరల్‌ జిల్లా వ్యాప్తంగా 401 గ్రామ పంచాయతీల్లో ఇళ్ల యజమానుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.  


వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆస్తుల సర్వే ప్రక్రియను జీడబ్ల్యూఎంసీ చేపడుతోంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, పన్నులు చెల్లిస్తున్న, చెల్లించని ఆస్తులు, క్రమబద్ధీకరించని భూముల్లో జరిగిన నిర్మాణాలు, అస్తెన్డ్‌ భూములు గ్రామ కంఠ, ఆబాది, శిఖం, భూదాన్‌, దేవాదాయ, వక్ఫ్‌ స్థలాలు, సమస్యాత్మక భూముల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. చెరువు శిఖం భూముల్లో భవనాలు, వాటికి నెంబర్ల కేటాయింపు తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో సర్వే నిర్వహణకు కొద్ది రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన వివరాలను సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో సమర్పించారు. 

Updated Date - 2020-09-29T06:47:02+05:30 IST