శానిటైజేషన్‌కు ప్రైవేట్ మంత్రం!
ABN , First Publish Date - 2020-07-18T07:51:37+05:30 IST
కొవిడ్-19 వచ్చిన తొలినాళ్లలో ఎక్కడైనా కరోనా అనుమానితుడు కనబడితే చాలు.. ఆ వీధి మొత్తాన్ని రెడ్‌జోన్‌గా కట్టడి చేసి, శానిటైజ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాలు హడావుడి చేసేవి. ఒకట్రెండు కేసులున్నప్పుడే ఇంతలా హంగామా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు వందలు, వేలల్లో

హైదరాబాద్ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 వచ్చిన తొలినాళ్లలో ఎక్కడైనా కరోనా అనుమానితుడు కనబడితే చాలు.. ఆ వీధి మొత్తాన్ని రెడ్‌జోన్‌గా కట్టడి చేసి, శానిటైజ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాలు హడావుడి చేసేవి. ఒకట్రెండు కేసులున్నప్పుడే ఇంతలా హంగామా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు వందలు, వేలల్లో కేసులు నమోదవుతున్నా.. శానిటైజేషన్‌ను అటకెక్కించేసింది. ‘‘మా కాలనీలో కరోనా కేసులున్నాయి శానిటైజ్ చేయండి’’, ‘‘మా అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్నవారికి కరోనా వచ్చింది.. డిసిన్ఫెక్షన్ స్ర్పేయర్‌కు చర్యలు తీసుకోండి’’ అని కోరుతున్నా, ప్రభుత్వ యంత్రాంగాల్లో స్పందన ఉండటంలేదు. కాస్త పలుకుబడి ఉన్నవారు ఒకవేళ ఉన్నతాధికారులతో ఒత్తిడి చేయించినా కిందిస్థాయి సిబ్బందికి చేతులు తడపందే పనికావడం లేదు. దీంతో తాము మెరుగైన సేవలు అందిస్తామంటూ ప్రైవేటు వ్యక్తులు శానిటైజేషన్ ప్రక్రియకు సై అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో, కార్యాలయాల్లో డిస్‌ఇన్ఫెక్షన్ ప్రక్రియను నిర్వహిస్తున్నవారే తమ సేవలను కాలనీలు, అపార్ట్‌మెంట్లలోనూ విస్తరిస్తామంటున్నారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడమేకాకుండా ఇతరత్రా డిస్‌ఇన్ఫెక్షన్ ప్రక్రియలను చేపడుతున్నారు.
స్టెరైల్ పిచికారి..!
నగరంలో కొవిడ్ కేసులతోపాటు శానిటైజేషన్, స్టెరిలైజేషన్ అవససరాలు పెరుగుతున్నాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీల అసోసియేషన్లు, కార్పొరేట్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులకు శానిటైజేషన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తమకు అందుబాటులోని డిస్‌ఇన్ఫెక్షన్ ద్రావణాలను పిచికారి చేయడం ద్వారా శానిటైజేషన్ ప్రక్రియను కొంతమంది అందిస్తుంటే, మరికొందరు టెక్నాలజీపై ఆధారపడుతున్నారు. కొవిడ్ వచ్చిన కొత్తలో సోడియం హైపో క్లోరైడ్‌తో శానిటైజేషన్ ప్రక్రియను నిర్వహించేవారు. ఆ తరహా ప్రక్రియల వల్ల నష్టాలున్నాయనడంతో చాలామంది సోడియం హైపోక్లోరైడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అవలంభిస్తున్నారు. ఈ విషయమై ‘అమిగో ఆటో స్పా’ అధినేత ధీరజ్ మాట్లాడుతూ ‘‘మేము అటు మనుషులతో పాటు వస్తువులకు కూడా హాని కలిగించకుండా వైర్‌సను నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నాం. గత సంవత్సరమే యాంటీ బ్యాక్టీరియా కోటింగ్‌ను పరిచయం చేశాం. ఆ అనుభవంతో ఇప్పుడు వైరస్ చంపడానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చాం’’ అని వివరించారు. జెర్మ్‌షూట్, యువీ స్టెరిలైజేన్ ప్రక్రియలను హైదరాబాద్‌లో అనుసరిస్తున్న ఒకేఒక్క కంపెనీ తమదేనని చెప్పారు. ఇప్పటికే చాలా కంపెనీలు, కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో శానిటైజేషన్ ప్రక్రియను అమలు చేశామన్నారు.
జెర్మ్‌షూట్ శానిటైజేషన్.. యూవీ స్టెరిలైజేషన్
మనుషులకు, వస్తువులకు ప్రమాదం కలిగించని సాంకేతికతతో ప్రధానంగా చెప్పుకోదగ్గవి జెర్మ్‌షూట్ శానిటైజేషన్, అలా్ట్ర వయొలెట్ (యూవీ) స్టెరిలైజేషన్. ప్రస్తుతం ఈ రెండు విధానాలకు డిమాండ్ ఉంది. జెర్మ్ షూట్‌లో అలా్ట్రలో వాల్యూమ్ పార్టికల్(యుఎల్‌వీ) ప్రక్రియను వినియోగిస్తారు. సాధారణంగా వైరస్ గాలిలో లేదా ఉపరితలాల మీద ఉంటుంది. ఈ రెండింటినీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జెర్మ్‌షూట్‌లో యుఎల్‌వీ ఉండటం వల్ల ఆక్సిజన్ మాలిక్యుల్స్‌ను మరింతగా బ్రేక్‌చేసి శుభ్రపరుస్తుంది. దీనివల్ల వైరస్ పునరుత్పత్తి కాదు. ఇందులో ఆల్కహాల్‌ను వాడరు. పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. శానిటైజేషన్ తర్వాత దాని తాలూకు మరకలేమీ కనిపించవు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కూడా దీన్ని ఆమోదించింది. యూవీ స్టెరిలైజేషన్ కూడా అత్యంత శక్తిమంతమైనది. ఇందులో ఎయిర్ స్టెరిలైజేషన్ చేస్తారు. ఆపరేషన్ థియేటర్లలో ఈ తరహా ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇప్పుడు కాలనీలు, అపార్ట్‌మెంట్లకూ ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. యూవీ టెక్నాలజీతో గాలిని శుద్ధీకరిస్తారు. కొన్ని కార్పొరేట్ కార్యాలయాలు ఈ యంత్రాలను సొంతంగా వినియోగిస్తున్నాయి.
శానిటైజేషన్‌కు రేట్లు ఇలా..!
శానిటైజేషన్ కోసం అడుగుల లెక్కన కొంత మంది చార్జీలు వసూలు చేస్తుంటే.. కొంతమంది మాత్రం అపార్ట్‌మెంట్‌కు నిర్దిష్ట మొత్తాలను (గుత్త) వసూలు చేస్తున్నారు. అడుగుకు రూపాయి మొదలు రెండు రూపాయలు వసూలు చేస్తుంటే, జెర్మ్‌సూట్ టెక్నాలజీ వినియోగిస్తే మాత్రం డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ అయితే రూ.3 వేలు, నాలుగు బెడ్‌రూమ్‌లకు రూ.4 వేలు, విల్లాలకు రూ.6 వేలు, పెద్ద కార్యాలయాలకు రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ శానిటైజేషన్ వల్ల 10-15 రోజుల వరకు ప్రభావం ఉంటుంది.