ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతివ్వలేదేం

ABN , First Publish Date - 2020-05-13T08:45:27+05:30 IST

‘‘అన్ని వసతులున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందించడానికి ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారు? ప్రైవేటు ల్యాబొరేటరీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు

ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతివ్వలేదేం

  • స్థోమత గలవారిని ‘గాంధీ’కి ఎలా పంపుతారు?
  • ఇది రోగుల జీవించే హక్కును హరించడమే: హైకోర్టు

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ‘‘అన్ని వసతులున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందించడానికి ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారు? ప్రైవేటు ల్యాబొరేటరీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఎందుకు అనుమతించడం లేదని’’ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నచ్చిన చోట చికిత్స పొందే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో భాగమని స్పష్టం చేసింది. ‘‘ఏ అధికారంతో ప్రభుత్వం ఆ హక్కును అడ్డుకుంటుంది? కరోనా రోగులను గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని ఎలా చెబుతున్నారు?’’ అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కొవిడ్‌-19 రోగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోడానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయడాన్ని, ప్రైవేటు ల్యాబ్‌లలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను అనుమతించక పోవడాన్ని ప్రశ్నిస్తూ జి.జయకుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ కె. లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. 


ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ బిల్లులు!

కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును భరించే వారిని నచ్చినచోట చికిత్స చేయించుకోడానికి ఎందుకు అనుమతించడం లేదని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ, ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇస్తే అధిక ఫీజులు వసూలు చేస్తాయన్నారు. కొందరు రోగులపై ప్రైవేటు ఆస్పత్రుల్లో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతోపాటు కనీస గౌరవం ఇవ్వకుండా వారిని గాంధీ ఆస్పత్రికి పంపుతారని ఆయన చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతిస్తే దుర్వినియోగం చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని ఆయన కోర్టుకు తెలిపారు. 


ఉస్మానియా, గాంధీలో దుర్భర పరిస్థితులు! 

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ శిక్షణ పొందిన డాక్టర్లతోపాటు సదుపాయాలూ ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు తమ ప్రతిష్ఠకు నష్టం చేకూరేలా ప్రవర్తించవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటూ మీడియా కథనాలు వెలుగులోకి తెస్తున్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంతమంది నాయకులు, ఉన్నతాధికారులు తమ అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకున్నారో లెక్కలు చెప్పాలని నిలదీసింది. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్నారని ప్రశ్నించింది.


దీనికి ఏజీ బదులిస్తూ... అనారోగ్య సమస్యలకు తాను ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కోర్టుకు తెలిపారు. ‘‘అయితే మీరు అక్కడే చికిత్స చేయించుకోండి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని డాక్టర్లపై నాకు నమ్మకం ఉంది. నేను అక్కడే వైద్యం చేయించుకుంటాను’’అని జడ్జి వ్యాఖ్యానించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్థోమత ఉన్నవారు చికిత్స చేయించుకోడానికి ముందుకొస్తే ప్రభుత్వం ఎలా అడ్డంకులు కల్పిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మంచి ఫలితాలు సాధించవచ్చని, కానీ ప్రభుత్వం ఎందుకో కీలకమైన ఈ అంశాన్ని విస్మరిస్తోందని వ్యాఖ్యానించింది. రోగి ఏ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించజాలదని పేర్కొంది. వాదనల తర్వాత తీర్పుని వాయిదా వేసింది. 

Read more