బీమా.. పాయె!

ABN , First Publish Date - 2020-08-18T06:46:48+05:30 IST

సీజన్‌ అనుకూలంగా ఉందని రైతులు హుషారుగా పంటలు సాగు చేస్తున్న సమయంలో

బీమా.. పాయె!

  • రైతులకు దూరమైన ప్రధాని ఫసల్‌ యోజన
  • తన వాటా ధనం తగ్గించుకున్న కేంద్ర సర్కార్‌
  • ప్రీమియం భారమని పథకం నిలిపేసిన రాష్ట్రం
  • అన్నదాతలను నిండా ముంచేసిన వరదలు
  • 62వేల ఎకరాలు మునక.. ఇంకా పెరిగే చాన్స్‌


హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంఽధ్రజ్యోతి): సీజన్‌ అనుకూలంగా ఉందని రైతులు హుషారుగా పంటలు సాగు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ముప్పు ముంచుకొచ్చింది. భారీ వర్షాలతో వరంగల్‌ రూరల్‌, భూపాలపల్లి, కరీంనగర్‌, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో వరి నీట మునిగింది. 15 వేల ఎకరాల్లో పత్తి పంట వర్షార్పణం అయింది. పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వ కాసుల కక్కుర్తి కారణంగా రైతులు నిండా మునిగారు. వారికి ఒక్క పైసా బీమా వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది వరకూ రైతులకు భరోసాగా ఉన్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమాకు ఆర్థిక సాయాన్ని కేంద్రం తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసింది.


ప్రీమియం చెల్లించలేక పిట్టకథలు

అనుకోని విపత్తులు సంభవిస్తే. రైతులు నిండా మునగకుండా ఉండటానికి పంటల బీమా తప్పనిసరి. సాధారణంగా పంటల పెట్టుబడికే ఇబ్బందులు పడే రైతులు.. బీమా ప్రీమియాన్ని ప్రైవేటుగా చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వారికి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పెద్ద దిక్కుగా ఉండేది. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌పై వానాకాలం పంటకు 2ు, యాసంగి పంటకు 1.5ు, వాణిజ్య పంటలకు 5ు ప్రీమియాన్ని రైతులే చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించాలనే నిబంధన ఉండేది. 2016-20 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించే 50 శాతాన్ని ఫిబ్రవరిలో తగ్గించుకుంది. నీటి వసతి ఉన్న ప్రాంతంలో 25ు, నీటి వసతి లేని ప్రాంతంలో 30ు మాత్రమే ప్రీమియం రూపంలో చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంది. రైతుల వాటాధనం పోగా మిగిలిన ప్రీమియం చెల్లింపును ఆర్థిక భారంగా భావిస్తున్న తెలంగాణతోపాటు.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఫసల్‌ బీమా నుంచి ఒకటొకటిగా వైదొలిగాయి. కేంద్రం తన వాటాను తగ్గించుకోవటం వల్లనే అమలు చేయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా ప్రీమియం చెల్లించడం లేదని, దాంతో, పథకం అమలు ఇబ్బందిగా మారుతోందని కేంద్రం ఆరోపిస్తోంది.


2 పంటలకే బీమా కంపెనీ

ఫసల్‌ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికే వదిలేయడంతో వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ) ముందుకొచ్చింది. అయితే, ఈ కంపెనీ అన్ని పంటలకూ బీమా చేయటం లేదు. కేవలం పత్తి, మిర్చి పంటలకు మాత్రమే ప్రీమియం తీసుకొని బీమా చేస్తోంది. కేవలం వర్ష బీమా పథకంగా మాత్రమే దీనిని అమలు చేస్తోంది. అతిగా వర్షాలు రావటమో, అసలు వర్షాలు రాకపోవటమో జరిగితేనే నష్ట పరిహారం చెల్లించేలా నిబంధనలు ఉన్నాయి. రాష్ట్రంలో 16 జిల్లాల్లో మిర్చి పంటకు బీమా చేస్తామని ఏఐసీ ప్రకటించింది. జీఎస్టీతో కలిపి ఎకరం పత్తికి రూ.1,699, మిర్చికి ఎకరానికి రూ.2,360 చొప్పున ప్రీమియం నిర్ధారించింది. పత్తి పంటకు రూ.28,800, మిర్చికి రూ.40 వేలు నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించింది. ప్రీమియం ఎక్కువగా ఉండటంతో పత్తి, మిర్చి రైతులు ముందుకు రావటం లేదు. ప్రీమియం చెల్లించటానికి ఈనెల 14 తేదీ నాటికే తుది గడువు ఉండగా.. దానిని 21 వరకు ఏఐసీ పొడిగించింది.రైతులకు బీమాలో గుజరాత్‌ ప్రత్యేకం

గుజరాత్‌ కూడా ఫసల్‌ బీమా పథకాన్ని అమలు చేయబోమని ప్రకటించింది. తమ రాష్ట్ర రైతాంగం కోసం ముఖ్యమంత్రి కిసాన్‌ సహాయ్‌ యోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రకటించారు. ఫసల్‌ బీమాతో అతి తక్కువ మంది రైతులకు మాత్రమే లాభం కలుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వ పథకంతో రైతులందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పంటల బీమా పథకాన్ని అమలు చేయటం లేదు. దాంతో, ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Updated Date - 2020-08-18T06:46:48+05:30 IST