‘కరోనా’పై యుద్ధానికి సన్నద్ధం!

ABN , First Publish Date - 2020-03-04T08:39:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో దాన్ని వ్యాప్తి, విస్తృతిని ఎదుర్కొనేందుకు సర్కారు అన్ని రకాలుగా సిద్ధమైంది. కరోనా బాధితుల కోసం మూడు వేల పడకల ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం

‘కరోనా’పై యుద్ధానికి సన్నద్ధం!

 • 3 వేల ప్రత్యేక పడకల ఏర్పాటు
 • 5 సర్కారీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు
 • ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ ఏర్పాట్లు
 • 50 వేల మాస్కులు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి
 • మంత్రివర్గ ఉపసంఘంలో కీలక నిర్ణయాలు
 • కరచాలనాలు వద్దు.. నమస్కారం చాలు
 • అనవసర భయాందోళనలు వద్దు: ఈటల 
 • నిలకడగా కరోనా బాధితుడి ఆరోగ్యం
 • ‘గాంధీ’ వార్డు పరిసరాల్లో నిషేధాజ్ఞలు
 • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అప్రమత్తం
 • తగ్గిన అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ
 • కరోనా భయంతో పలు స్కూళ్లకు సెలవులు
 • వ్యాధి సోకే అవకాశం ఉన్నవారి గుర్తింపునకు
 • రంగంలోకి దిగిన 500 మంది సిబ్బంది
 • నేటి నుంచి  104 హెల్ప్‌లైన్‌ నంబరు

100కోట్లు కరోనాపై పోరుకు తక్షణ కేటాయింపు

రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌.. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే మన వాతావరణంలో మనలేదనుకున్న వైరస్‌..  ఒక్కసారిగా తన ఉనికిని చాటడంతో సర్కారు అప్రమత్తమైంది! మహమ్మారి కొవిడ్‌-19పై బహుముఖ పోరుకు సన్నద్ధమైంది!! 


ఇప్పటికే ఆ వైరస్‌ బారిన పడిన బాధితుడికి చికిత్సనందిస్తూ, అతడి నుంచి వైరస్‌ వ్యాపించడానికి అవకాశమున్న 88 మందిని గుర్తించింది! వారిలో 45 మందిని ఆస్పత్రిలో  ఐసోలేషన్‌ వార్డులో చేర్చి.. 36 మందికి వైద్యపరీక్షలు నిర్వహించింది! వారి ద్వారా వైరస్‌ సోకడానికి అవకాశమున్నవారిని గుర్తించేందుకు 500 మంది  వైద్య, ఆరోగ్య సిబ్బందిని రంగంలోకి దించింది!!  వైరస్‌ను అడ్డుకునే చర్యల కోసం తక్షణం రూ.100 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో  కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో దాన్ని వ్యాప్తి, విస్తృతిని ఎదుర్కొనేందుకు సర్కారు అన్ని రకాలుగా సిద్ధమైంది. కరోనా బాధితుల కోసం మూడు వేల పడకల ఐసోలేషన్‌ వార్డులను  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు మంగళవారం ఉదయం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. వైద్య మంత్రి ఈటల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌కు  చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లకై తక్షణమే వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ఏ ఏ శాఖ ఏ విధంగా పనిజేయాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే 104 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ప్రస్తుతం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనప్పటికీ, దాని ప్రభావం మరో 88 మందిపై ఉండటంతో సుమారు 3 వేల ఐసోలేషన్‌ పడకలను సిద్ధం చేస్తోంది. గాంధీ, చెస్ట్‌లతో పాటు మిలటరీ ఆస్పత్రి, కింగ్‌కోఠీ, వికారాబాద్‌ చెస్ట్‌ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు.


హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలోని బెడ్స్‌ను కూడా ఐసోలేషన్‌  కోసం సంప్రదింపులు జరిపారు. ఒక్కో కాలేజీ నుంచి 200 పడకల చొప్పున 2 వేల పడకలను కరోనా కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిద్ధం చేస్తోంది. తక్షణమే 50 వేల ఎన్‌ 95 మాస్కులను పంపాలని కేంద్రాన్ని కోరింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సర్కారు భారీ ప్రచారం చేయనుంది. కరోనా కేసులు వస్తే సకాలంలో గుర్తించి వెంటనే సమాచారం ఇవ్వాలని అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులను ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో నమోదైన తొలి మూడు కేసులు కేరళ రాష్ట్రానికి చెందినవే. వారు చాలా పకడ్బందీగా చికిత్స అందించిన నేపథ్యంలో అక్కడి వైద్య విధానాలపై అధ్యయనం చేసేందుకు ఓ వైద్య బృందాన్ని కేరళకు పంపాలని సర్కారు నిర్ణయించింది. 


కార్యాచరణ ఇలా..

ప్రతి శాఖ ఓ నోడల్‌ అధికారిని నియమించి, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకోవాలి. ఆ నోడల్‌ అధికారి కరోనా సమాచారం ఆరోగ్య శాఖకు తెలియజేయాలి. అనుమానిత కేసులపై కాల్‌ సెంటర్‌కు సమాచారం అందించాలి.

అన్ని శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కరోనా టోల్‌ ఫ్రీ నంబరును విస్తృతంగా ప్రచారం చేయాలి.

కేసుల ఛేదనలో వైద్య ఆరోగ్యశాఖకు సహాయ సహకారాలను అందించాలి. సోషల్‌ మీడియా, న్యూస్‌ ఆర్టికల్స్‌పై నిఘా పెట్టాలి. 

కరోనా కాంటాక్టు ట్రేసింగ్‌లో ప్రయాణికుల వివరాలన్నింటిని  వైద్య ఆరోగ్యశాఖకు అందించడంలో రవాణాశాఖ సహకరించాలి. 

స్వదేశీ, విదేశీ పర్యాటకుల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ ఐడీలకు రిజస్టర్‌ నిర్వహించాలి. విదేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వారి బస వివరాలను సేకరించి అప్పగించే బాధ్యత టూరిజం శాఖదే.

స్వదేశీ, విదేశీ పర్యాటకులకు కరోనా లక్షణాలుంటే వెంటనే జిల్లా వైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. విధిగా గ్రామ సభలను నిర్వహించి అవగాహన కల్పించాలి. మునిసిపల్‌ శాఖ కరోనా నియంత్రణ ప్రణాళిక కోసం భౌగోళికంగా జోన్ల విభజనను గుర్తించాలి. 

ఆటోలు, గుడులు, చర్చిలు, మసీదుల్లో మైక్‌ ఎనౌన్స్‌మెంట్‌ చేయా లి. అనుమానితుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు అందివ్వాలి. 

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనాపై అవగాహన కల్పించే బాధ్యత విద్యాశాఖదే. 

సబ్బు, ఆల్కహాల్‌ శానిటైజర్స్‌తో చేతులు కడుక్కోవడాన్ని  ప్రోత్సహించాలి.. పాఠశాల గది తలుపులు, హ్యాండిల్స్‌, లాక్స్‌ను 

డిటెర్జంట్స్‌తో శుభ్రం చేయాలి.

పిల్లలకు ఫ్లూ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

Updated Date - 2020-03-04T08:39:36+05:30 IST