మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధం
ABN , First Publish Date - 2020-12-15T08:08:11+05:30 IST
మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి అన్నారం రిజర్వాయర్‌కు మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి.

మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి అన్నారం రిజర్వాయర్‌కు మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంపుహౌస్‌లో సోమవారం రాత్రి 17వ మోటార్‌కు ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీల సామర్థ్యానికి పెంచటంతో అదనంగా మరో ఆరు మోటార్లు బిగించే పనిని సుమారు రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టారు.
చివరిది అయిన 17వ నెంబరు మోటార్ పనులను సోమవారం పూర్తి చేసిన అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో మొత్తం 17 మోటార్లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని గోదావరిలో ఎగువకు ఎత్తిపోసే సామర్థ్యం చేకూరింది.