కేసీఆర్‌పై యుద్ధానికి సిద్ధమవ్వాలి
ABN , First Publish Date - 2020-11-25T06:51:49+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో కేంద్ర బిందువైన ఓయూను, అక్కడి విద్యార్థులను అణచివేస్తున్న సీఎం కేసీఆర్‌పై విద్యార్థిలోకం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని బీజేవైఎం జాతీయ

తెలంగాణలో సీఎం కుటుంబమే బాగుపడింది
కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పాలి
1969 పోరాట యోధులను కలిసేందుకు వెళితే అడ్డుకుంటారా?
తెలంగాణ కేసీఆర్ జాగీరా? తేజస్వీ సూర్య
వందల మందితో ర్యాలీగా ఓయూకి
ఉప్పల్/హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో కేంద్ర బిందువైన ఓయూను, అక్కడి విద్యార్థులను అణచివేస్తున్న సీఎం కేసీఆర్‌పై విద్యార్థిలోకం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి మూలం ఓయూనేనని అన్నారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో 1969 తెలంగాణ పోరాట యోధులతో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సమాశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు వందల మంది బీజేవైఎం కార్యకర్తలతో తేజస్వి సూర్య ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు.
1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిలో కొందరితో ఆయన మాట్లాడారు. విద్యార్థుల త్యాగాల తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడింది తప్ప విద్యార్థులకు, యువతకు న్యాయం జరగలేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుంటోందని, ఆ నిధుల్లో ప్రతి పైసాకు లెక్కచెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీదేనని పేర్కొన్నారు. అంతకుముందు ఓయూలోకి వచ్చేందుకు ర్యాలీగా బయలుదేరిన తేజస్వి సూర్యను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ బీజేవైఎం నాయకులు, బలవంతంగా గేట్లు తెరిచి అడ్డంగా ఉన్న ముళ్ల కంచెలను తొలగించారు.
ఈ సమయంలో పోలీసులు, బీజేవైఎం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో తేజస్వి సూర్య వందలాది మంది బీజేవైఎం నాయకులతో కలిసి ర్యాలీగా ఓయూలోపలికి ప్రవేశించారు. తెలంగాణ కోసం 1969లో పోరాడిన యోధులను కలిసేందుకు వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఓయూ ఏమైనా కేసీఆర్ కుటుంబ జాగీరా అని నిలదీశారు. అయితే ఓయూ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు తేజస్విపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతకుముందు తేజస్విని పోలీసులు అడ్డుకున్నారంటూ వచ్చిన వార్తలను ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్ ఖండించారు. ఓయూ క్యాంపస్ గేటు వద్ద తేజస్విని పోలీసులు అడ్డుకున్నారని తొలుత ఓ విభాగానికి చెందిన మీడియాలో... క్ర మంగా సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయని అన్నారు. అలాంటి ఘటన ఏదీ అక్కడ జరగలేదని... ఎంపీ, ఆయన అనుచరులు నేరుగా క్యాంప్‌సలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద శాంతియుతంగా సమావేశాన్ని నిర్వహించారన్నారు. తప్పుడు వార్తలు వైరల్ చేసి ప్రజల్లో ఆందోళన కలిగించరాదని కోరారు.
కాగా ఓయూలో తేజస్వి సూర్య పర్యటించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎ్‌సయూ సభ్యులు, వర్సిటీని ఫినాయిల్‌తో శుద్ధి చేశారు.
