నర్సాపూర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సిద్ధం

ABN , First Publish Date - 2020-12-10T08:10:31+05:30 IST

పేదోడి సొత ఇంటి కల నెరవేరేలా సకల హంగులతో సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సిద్ధమయ్యాయి. దేశానికే ఆదర్శంగా నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలివిడతగా 1341 ఇళ్లను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో 144 మంది గృహ ప్రవేశాలు చేయనుండగా, మిగతా

నర్సాపూర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సిద్ధం

రాష్ట్రంలోనే తొలిసారి 1341 ఇళ్ల కేటాయింపు

సకల హంగులతో  ఇళ్ల నిర్మాణం పూర్తి

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక సర్వే

10న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌


సిద్దిపేట సిటీ, డిసెంబరు 9:  పేదోడి సొత ఇంటి కల నెరవేరేలా సకల హంగులతో సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సిద్ధమయ్యాయి. దేశానికే ఆదర్శంగా నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలివిడతగా 1341 ఇళ్లను ప్రారంభించనున్నారు.  సీఎం కేసీఆర్‌ సమక్షంలో 144 మంది గృహ ప్రవేశాలు చేయనుండగా, మిగతా వారు విడతల వారీగా కొత్త ఇళ్లలోకి వెళ్లనున్నారు. గృహ ప్రవేశ సమయంలో ఇంటి పట్టాతో పాటు కరెంట్‌ మీటర్‌ నంబరు, వాటర్‌ కనెక్షన్‌ మార్పిడి పత్రం, ప్రాపర్టీ టాక్స్‌, కామన్‌ అఫిడవిట్‌, వంట గ్యాస్‌ సంబంధిత పత్రాలను లబ్ధిదారుల పేరున అందించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నర్సాపూర్‌లో  దాదాపు రూ.163 కోట్ల వ్యయంతో 2460 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో  తొలి విడతగా 1341 ఇండ్లను పేదలకు అందించనున్నారు.  మిగిలిన 1119 ఇళ్లను దశలవారీగా అర్హులకు కేటాయిస్తారు.


అర్హులకే ఇళ్ల కేటాయింపు

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉండేందుకు మంత్రి హరీశ్‌రావు, అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. 250 మంది జిల్లా, ఇతర ఉన్నతాధికారులు 6 నెలలు నిర్విరామంగా కృషిచేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంత్రి, జిల్లా కలెక్టరు తరచు సమీక్షలు నిర్వహించి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో పలుమార్లు విచారణ జరిపి సాంకేతికత దన్నుగా బిగ్‌ డేటాను రన్‌చేసి దరఖాస్తుదారుల వివరాలను సరిపోల్చారు. ప్రజలనుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల జాబితాను రూపొందించారు.  వార్డు కౌన్సిలర్ల సమక్షంలో లాటరీ విధానంలో ఇళ్ల కేటాయింపు జరిపారు. డ్రా ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు.


హరీశన్న నా కల నెరవేర్చిండు

బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట సిద్దిపేటకు వచ్చాం. అప్పటి నుంచి నేను, నా భర్త రోజువారీ కూలీ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం. వచ్చే సంపాదన కిరాయిలు పిల్లల చదువులకు సరిపోవడం లేదు. ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ఇళ్లను  కేటాయించడం చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌ సార్‌, హరీశన్న దయతో ఇయ్యాల నాలాంటి పేదవాళ్ల కల నెరవేరుతోంది.

- కృష్ణవేణి, 21వ వార్డు


మేము సచ్చేదాక కేసీఆర్‌, హరీశ్‌ను గుర్తుపెట్టుకుంటాం

ఎన్నో ఏండ్ల సంది కిరాయి ఇళ్లలోనే ఉంటున్నాం. కూలీ చేసుకుని బతికేటోళ్లం. మేము సాయిబాబాను కొలుస్తాం. మా గోస హరీశ్‌ అన్న, మజ్జున్న విన్నారు. కేసీఆర్‌ తండ్రి లెక్క మాకు ఇల్లు ఇప్పించిండు. మేము సచ్చేదాక కేసీఆర్‌, హరీశ్‌రావును దేవుండ్లుగా కొలుస్తాం.

- జూలూరి అనురాధ, 1వ వార్డునర్సాపూర్‌ డబుల్‌ బెడ్రూం ప్రత్యేకతలు 

 • 24 గంటల వంట గ్యాస్‌ సరఫరా, తాగునీరు, విద్యుత్‌ సరఫరా
 • అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రెండు పెద్ద కమ్యూనిటీహాళ్లు
 • సమీకృత మార్కెట్‌ కాంప్లెక్స్‌, పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌
 • షాపింగ్‌ కాంప్లెక్స్‌, బస్తీ దవాఖానా,నాలుగు పార్కులు
 • విశాలమైన రోడ్లు, ఎల్‌ఈడీ వీధి దీపాలు
 • రాజీవ్‌ రహదారికి అతి సమీపం, ప్రత్యేక సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌
 • అండర్‌ గ్రౌండ్‌ సంపు, పవర్‌ బోర్‌ వేల
 •  ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా
 • తాగునీటి కనెక్షన్లకు వాటర్‌ మీటర్లు
 • 20 కమ్యూనిటీ ఇంకుడు గుంతలు
 • అంతర్గత, ప్రధాన రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు

Updated Date - 2020-12-10T08:10:31+05:30 IST