ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-08T14:35:56+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు...

ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. చింతల్‌బస్తీలో ఉన్న వైశ్య భవన్‌లో మారుతీరావు నిన్ననే ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న మారుతీరావును చూసిన వైశ్య భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మారుతీరావు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మారుతీరావు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ప్రణయ్ హత్య కేసు పూర్వాపరాలివి...

మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. కూతురంటే వల్లమాలిన ప్రేమ.. కానీ, ఆ ప్రేమే ద్వేషంగా మారింది.. తన గారాలబిడ్డ కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించాడు.. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం పన్నాడు.


చిల్లి గవ్వ కూడా దక్కొద్దు!

కూతురికి ఆస్తి దక్కకూడదని, ఆమె భర్త కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. రూ.కోటి సుపారీ ఇచ్చి మరీ ప్రణయ్‌ని హత్య చేయించాడు. సంచలనం సృష్టించిన అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ప్రణయ్‌ హత్యకు మాజీ ఐఎస్‌ఐ తీవ్రవాదులతో మారుతీరావు కోటి రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నాడని పోలీసు విచారణలో తేలింది. తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అమృతకు చెందకూడదని, తన స్వార్జితమైన ఆస్తులపై ఆమెకు ఎటువంటి హక్కు లేదని వీలునామాలో స్పష్టం చేశాడని.. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన పరువు హత్య అని పోలీసులు స్పష్టం చేశారు.


ఇటీవలే ఇలా..

మారుతీరావుకు సంబంధించిన షెడ్డులో ఇటీవలే గుర్తు తెలియని మృతదేహం లభించింది. మారుతీరావు షెడ్డులో మృతదేహం లభించడం అదికూడా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగిన సంగతి తెలిసిందే.





Updated Date - 2020-03-08T14:35:56+05:30 IST