ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలు నాటిన ప్రభాస్

ABN , First Publish Date - 2020-06-12T00:23:18+05:30 IST

“పుడమి పచ్చగుండాలే – మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన...

ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలు నాటిన ప్రభాస్

“పుడమి పచ్చగుండాలే – మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”  కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని అన్నారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా సంతోష్ దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం నన్ను ఇన్‌స్పైర్ చేసింది. అందుకే వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నాను.” సంతోష్ కుమార్ మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజం బావుంటుందని నా భావన. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని చెప్పారు. 

ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.


జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. వారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయకం. ఇంత మంచి మనస్సున్న ప్రభాస్ చేతుల మీదగా ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” మూడవ దశ కార్యక్రమం జరగడం చాలా సంతోషం.  కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా “ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి” నేలతల్లికి పచ్చని పందిరివేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని అన్నారు. 

 

Updated Date - 2020-06-12T00:23:18+05:30 IST