అధికార ముఠా.. భూములు ఠా
ABN , First Publish Date - 2020-12-13T07:13:53+05:30 IST
అక్షరాలా రెండు వందల కోట్లు! మామూలుగా అయితే, ఎన్నేళ్లు కష్టపడితే సంపాదించాలి! కానీ, ఇటీవల ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నయా పైసా పెట్టుబడి లేకుండా కేవలం ఓ భూ దందాలో కొట్టేశారు!

హైదరాబాద్, శివార్లలో నేతల భూ అరాచకాలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఆరోపణలు
ధమ్కీలు ఇచ్చి మరీ కోట్ల రూపాయల దందాలు
ఒక్క డీల్‌తో 200 కోట్లు నొక్కేసిన ఇద్దరు నేతలు
ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యాపారవేత్తకే బెదిరింపు
శివార్లలో 300 ఎకరాల డీల్‌తో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి చెరో వంద కోట్లు
దందా సొమ్ముతో అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలు
ఒక్క డీల్‌తో 100 ఎకరాలు కొన్న మరో ఎమ్మెల్యే
గజానికి ధర ఫిక్స్ చేసిన మరికొందరు
వెంచర్ వేస్తే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకీ వాటాలు
కప్పం వసూళ్లకు ప్రత్యేకంగా వ్యవస్థల ఏర్పాటు
తప్పుడు పత్రాలు సృష్టించి మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశారని శ్యామలాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రిపై భూకబ్జా కేసు కూడా నమోదైంది. చేర్యాల పెద్ద చెరువు మత్తడి ప్రాంగణంలో అరెకరాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గుప్పిట పట్టారం టూ విపక్షాలన్నీ కలిసి శుక్రవారం మహాగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఆరోపణలను ఆ ఇద్దరూ ఖండిం చారు. కానీ, వీరు మాత్రమే కాదు.. భూ కబ్జాలకు సంబంధించి అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు రాజకీయ వ్యాపారులు! అధికారమే పెట్టుబడి! హైదరాబాద్, చుట్టుపక్కల విలువైన భూములే వారికి కాసులు కురిపించే కల్పవృక్షాలు! అవి వివాదాస్పదమైతే, ఇక వారి పంట పండినట్లే! భూమి తమది కాకపోయి నా.. భూ యజమానులకు ధమ్కీలు ఇచ్చి కోట్లు నొక్కేస్తున్నారు! సర్కార్లో ‘అంతా మేమే’ అన్నట్లు వ్యవహరిస్తున్న కొందరు నేతల అరాచకాలివి!
వీరి ఆగడాలకు బడా వ్యాపారవేత్తలూ బెంబేలెత్తుతున్నారు! అధికార పార్టీ నేతలే దందాలు చేస్తుండడంతో బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. స్థిరాస్తుల క్రయ విక్రయాలన్నీ తమ కనుసన్నల్లో జరిగేలా వీరు ప్రత్యేక వ్యవస్థలనే తయారు చేసుకున్నారు. వీరిలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, నగర శివార్లలో రాజకీయ మాఫియా భూ దందాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక వరుస కథనాలు నేటి నుంచి!
(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం)
అక్షరాలా రెండు వందల కోట్లు! మామూలుగా అయితే, ఎన్నేళ్లు కష్టపడితే సంపాదించాలి! కానీ, ఇటీవల ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నయా పైసా పెట్టుబడి లేకుండా కేవలం ఓ భూ దందాలో కొట్టేశారు! అది కూడా.. రాజకీయాల్లోకి ఇలా వచ్చి అలా మెరిపించి వెళ్లిన ఓ వ్యాపారవేత్త ఆస్తికి మోకాలడ్డు పెట్టి మరీ నొక్కేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో సదరు వ్యాపారవేత్తకు సుమారు 300 ఎకరాల భవ్యమైన భూమి ఉంది. రియల్ ఎస్టేట్, సినిమా రంగంలో పేరొందిన ఆ వ్యాపారవేత్త గతంలో టీడీపీ తరఫున నగర శివార్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం, మళ్లీ వ్యాపారంపై దృష్టిపెట్టారు.
ఇందులో భాగంగా, శివార్లలో ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకుని ఉన్న వందల కోట్ల విలువైన 300 ఎకరాల భూమిలో తానే వెంచర్లు వేసి వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ, దానిపై స్థానికంగా ఉండే ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కన్నుపడింది. ఇద్దరూ కలిసి చకచకా పావులు కదిపారు. ఆ భూమిని తమకు అమ్మాలంటూ సదరు వ్యాపారవేత్తపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ససేమిరా అనడంతో నానా ఇబ్బందులు పెట్టారు. ఆ భూమిని ఆయన వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నించగా.. బేరాలు రాకుండా అడ్డుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సదరు వ్యాపారవేత్త వారికే భూమి అమ్మేందుకు సిద్ధమయ్యారు. అంతే.. ఆ ప్రజా ప్రతినిధులు ఇద్దరూ ఆ భూమికి ఒక ధర నిర్ణయించి.. తమ సన్నిహితులకు సంబంఽధించిన బడా రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించారు. తమకు సంబంధం లేని భూమిపై వీరిద్దరూ ఇలా వ్యాపారం చేశారు.
వేరే వాళ్ల భూమికి మోకాలు అడ్డుపెట్టి వీరిద్దరూ చెరో రూ.100 కోట్లు అంటే మొత్తం రూ.200 కోట్లు కొట్టేశారు. విచిత్రం ఏమిటంటే.. ఈ డీల్‌లో బాధితుడు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా.. ఆయనపై గెలిచిన వ్యక్తే దందాకు సూత్రధారి కావడం విశేషం. ఈ డీల్‌లో భారీ మొత్తంలో వెనకేసుకున్న బడా నేతలు ఇద్దరూ గడిచిన కొన్నాళ్లుగా వందల కోట్లు సంపాదించారు. కీలక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు ఎమ్మెల్యే ఏడాదిన్నర కాలంలో చేసిన సెటిల్‌మెంట్లకు లెక్క లేదు.
ఇక, రాజు-పేదకు ప్రతినిధి అయిన వీరిలో ఒకరు గజ్వేల్‌లో ఒకేచోట 380 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. తొలిసారి ఎమ్మెల్సీ అయిన ఆయన తన అఫిడవిట్‌లో రూ.10 లక్షలలోపే ఆదాయం చూపించారు. ఆయన ఆస్తులు ఇప్పుడు ఏడెనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా. కొందరు పెద్దలకు ఆయన బినామీ అని కూడా ప్రచారంలో ఉంది.
ఇద్దరు ఎమ్మెల్సీలు, గ్రేటర్‌లో ఉన్న ఓ ముఖ్య నేతతో కలిసి వీరిద్దరూ డీల్స్ చేస్తుంటారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల భూముల క్రయ విక్రయాలు, నిర్మాణాలన్నింటిలోనూ వీరు తల దూరుస్తున్నారు. వీరికి తెలియకుండా అక్కడ ఒక్క నిర్మాణం కూడా జరగదంటే ఆశ్చర్యం లేదు. వందల కోట్లకు పడగలెత్తిన వీరంతా రోజూ రాజకీయం కంటే దందాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వెరసి, నగరం, శివార్లలో కొన్నిచోట్ల ప్రజలు స్వేచ్ఛగా తమ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేదు.
అవసరార్ధం ఎవరైనా తమ భూమి అమ్మకానికి పెడితే స్థానిక నేతలకు సంబంఽధించిన మనుషులు వాలిపోతున్నారు. ఈ భూమి అమ్మితే గిమ్మితే తమ ద్వారానే అమ్మాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం పరిపాటిగా మారింది. వీరిని కాదని వేరే బేరం కుదుర్చుకుంటే ఒప్పుకోరు. రేట్లు కూడా వారే ఫిక్స్ చేస్తున్నారు. లేదంటే ఏదో కిరికిరి చేస్తారు. వీళ్ల బాధ భరించలేక భూ యజమానులు భూములను వాళ్ల చేతుల్లోనే పెడుతున్నారు.
ఒక్క డీల్.. 100 ఎకరాల కొనుగోలు
భూముల క్రయ విక్రయాల్లో మధ్యవర్తులుగా ఉండి రూ.కోట్లలో వెనకేసుకుంటున్న నేతలు కోకొల్లలు. మరికొందరు బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రారంభించారు. వాటి ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నగరంలో భూ దందాలకు పేరొందిన పంచ ప్రజా ప్రతినిధులకు అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఎమ్మెల్యే కూడా ఇటీవల రియల్ సంపాదనలో మునిగిపోయారు.
రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సదరు ఎమ్మెల్యే ఇదే మంచి సమయం అన్నట్లుగా దూకుడుగా ఉన్నారు. ఆయన తరఫున తోడల్లుడు అత్యంత వివేకంతో ఈ డీల్స్ చేస్తుంటారు. ఒక్క డీల్‌తో వచ్చిన సొమ్ముతో మేడ్చల్ సమీపంలో సదరు ఎమ్మెల్యే ఏకంగా 100 ఎకరాల భూమి కొనుగోలు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆయన పక్క నియోజక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థనే నడుపుతున్నారు. సదరు సంస్థ ద్వారా బ్లాక్ మనీని వైట్ చేస్తారని ప్రచారంలో ఉంది. అంతేకాక, ఆయన మరో సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. సమస్యలు ఉన్నప్పటికీ గ్రేటర్, హెచ్‌ఎండీఏ పరిధిలో వెంచర్లు, భవన నిర్మాణ అనుమతులను ఆయన ఇట్టే తీసుకురావడంలో దిట్ట.
అనుమతులు తీసుకు వచ్చేందుకు ఆయన స్థలాన్ని బట్టి రేట్లు వసూలు చేస్తుంటారు కూడా. ఇక, భూ వివాదాల్లో ఓ అమాత్యుని పేరు కూడా ఇప్పుడు మారుమోగుతోంది. ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎకరాల్లో ఎవరైనా అమ్ముతున్నారంటే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు వాలిపోతున్నారు.
హైటెక్ సిటీ చుట్టుపక్కల పెట్టుబడులు
ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే ఈ అయిదుగురు నేతలూ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో హైటెక్ సిటీ చుట్టుపక్కల భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. సింహ భాగం అయ్యప్ప సొసైటీలోనే పెట్టారు. ఇక్కడ నిర్మాణాలపై నిషేధం ఉన్నప్పటికీ భవంతులు నిర్మిస్తున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది చూసినా చూడనట్లు వదిలేస్తున్నారు. అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దాంతో, ఇక్కడ సామాన్యులకు చెందిన భవనాలనే కూల్చి వేశారు. ఈ బడా నేతల భవనాల జోలికి వెళ్లలేదు.
గజానికి రూ.500 నుంచి రూ.1000
వెంచర్లు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ తీసుకున్నారా!? అయినా సరే.. స్థానిక నేతలకు కప్పం కట్టాల్సిందే! అది కూడా గజానికి ఇంత అని! శివార్లలో అయితే కొందరు స్థానిక నేతలు వెంచర్లలో వాటాలు తీసుకుంటున్నారు. హెచ్‌ఎండీఏ నుంచి అన్ని అనుమతులూ తీసుకున్నా జాన్తానై! వెంచర్లలో తమకు ప్లాటు కావాలని లేదంటే గజానికి ఇంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ధరలు ఫిక్స్ చేశారు. కొందరు గజానికి రూ.500 చొప్పున నిర్ణయించారు. మేడ్చల్ జిల్లాలో కొందరు నేతలు వెంచర్లు వేసిన వారి నుంచి గజానికి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. విల్లాలు కడితే అందులో వాటాలు అడుగుతున్నారు.
కరోనాకు ముందు శివారులో ఒకాయన వెంచర్ వేశారు. కరోనాతో ఆయన ప్లాన్లన్నీ తలకిందులయ్యాయి. ఎలాగోలా వాటిని అమ్ముకుందామని అనుకుంటే.. తొలుత ఎమ్మెల్యే వచ్చారు. ఓ ప్లాట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ కూడా ప్లాటుకు టెండర్ పెట్టారు. అనుమతుల కోసం అధికారులకు మరో ప్లాటు సమర్పించక తప్పలేదు. దాంతో, వెంచర్ వేస్తే వచ్చే లాభమే నాలుగు ప్లాట్లు అయితే, దానిని కప్పంగా సమర్పించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లో కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మరీ బరితెగిస్తున్నారు.

ప్రతి గజానికీ కప్పం కట్టాల్సిందే
కొందరు స్థానిక నేతల అనుమతి లేకుండా ఇటుక కూడా పెట్టే పరిస్థితి లేదు. దీంతో నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు. నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు ఇసుక, కంకర, ఇతర సామగ్రి తీసుకురాగానే వీరంతా రాబందుల్లా వాలిపోతారు. తమకు సుంకం కట్టకపోతే పనులు మొదలు పెట్టనివ్వరు. వసూళ్ల కోసం కొందరు ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.
తమ ప్రాంతాల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే నిమిషాల్లోనే వీరికి సమాచారం తెలిసిపోతుంది. అన్ని అనుమతులూ తీసుకున్నా.. తమకు వాటాలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తారు. భారీ భవన నిర్మాణాల్లో అయితే వాటాలు అడుగుతున్నారు. వివాదాల్లో ఉన్న భూములను నేరుగా సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఇలాంటివాటిల్లో కొందరు మంత్రుల పేర్లు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి.