సుప్రీంకు విద్యుత్తు సంస్థలు

ABN , First Publish Date - 2020-07-18T08:07:46+05:30 IST

ఉద్యోగుల విభజనపై తెలంగాణ విద్యుత్తు సంస్థలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. విద్యుత్తు ఉద్యోగుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని పేర్కొంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. విద్యుత్తు ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు విరుద్ధంగా జస్టిస్‌ డీఎం ధర్మాధికారి కేటాయింపులు చేశారని

సుప్రీంకు విద్యుత్తు సంస్థలు

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల విభజనపై తెలంగాణ విద్యుత్తు సంస్థలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. విద్యుత్తు ఉద్యోగుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని పేర్కొంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. విద్యుత్తు ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు విరుద్ధంగా జస్టిస్‌ డీఎం ధర్మాధికారి కేటాయింపులు చేశారని ఆక్షేపించాయి. ఈనెల 15న విద్యుత్తు సంస్థలు పిటిషన్‌ వేయగా... 16వ తేదీన యూనియన్లు ఇంప్లీడ్‌ అయ్యాయి. ఈ పిటిషన్లను విచారించాలా? వద్దా? అన్న అంశంపై న్యాయస్థానం త్వరలోనే విధాన నిర్ణయం తీసుకోనుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు ఉద్యోగుల విభజన వివాదం  ఐదేళ్లుగా నలుగుతోంది. 2015 జూన్‌లో 1,157 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్తు సంస్థలు రిలీవ్‌ చేశాయి. అదే వేగంతో ఏపీలో పని చేస్తున్న 229 మంది(తెలంగాణ స్థానికత కలిగిన వారు) సెల్ఫ్‌ రిలీవ్‌కాగా... వారిని  తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేర్చుకున్నాయి. దీనిపై అప్పట్లోనే ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నాలుగున్నరేళ్లపాటు వీరికి విధులు కేటాయించకుండానే వేతనాలు చెల్లించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జస్టిస్‌ డీఎం ధర్మాధికారి కమిటీ ఏర్పాటు కాగా... సుదీర్ఘ చర్చల అనంతరం 1,157 మందిలో ఆప్షన్లు ఇచ్చిన 655 మందిని ఏపీకే కేటాయించి... మిగిలిన 502మందితో పాటు సెల్ఫ్‌ రిలీవ్‌ అయిన 229 మందినీ తెలంగాణకే కేటాయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ విద్యుత్తు సంస్థలు... 655 మందిని చేర్చుకోవడానికి నిరాకరించాయి. ఆ తర్వాత పరిణామాలతో తెలంగాణకు మొత్తం 655 మందిని ఏపీ విద్యుత్తు సంస్థల నుంచి కేటాయించారు. అయితే, వీరిలో 71 మంది మాత్రమే నిబంధనలకు అనుగుణంగా వచ్చారని పేర్కొంటూ తెలంగాణ విద్యుత్తు సంస్థలు పోస్టింగ్‌లు ఇచ్చాయి. మిగతా 584 మంది భవితవ్యం సుప్రీంకోర్టు నిర్ణయంతో ముడిపడి ఉంది.

Updated Date - 2020-07-18T08:07:46+05:30 IST