పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై మక్కలు

ABN , First Publish Date - 2020-05-17T08:54:21+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో భారీగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కోళ్లకు దాణాగా అందించే మొక్కజొన్నను పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది...

పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై మక్కలు

1525కు క్వింటాలు చొప్పున 

మార్క్‌ఫెడ్‌ ద్వారా సరఫరా


హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రభావంతో భారీగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కోళ్లకు దాణాగా అందించే మొక్కజొన్నను పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. రూ.1525కే క్వింటాలు మొక్కజొన్నలు అందించేలా పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పౌలీ్ట్ర ఫెడరేషన్‌, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌లు గుర్తించిన పౌల్ట్రీ రైతులకు సబ్సిడీ మొక్కజొన్నలు సరఫరా చేయనున్నారు. మొత్తం 5లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన సొమ్మును రైతులు ప్రతివారం సమాన వాయిదాల పద్ధతిలో రెండు నెలలపాటు మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. రవాణా చార్జీలను పౌల్ట్రీ రైతులే భరించాలి. మొక్కజొన్న నింపిన బస్తాల ఖర్చు, వాహనాల్లో లోడ్‌ చేసేందుకు అయ్యే ఖర్చును మాత్రం మార్క్‌ఫెడ్‌ భరిస్తుంది. కాగా, కోళ్ల దాణా నిమిత్తం పంపిణీ చే సిన మొక్కజొన్నను రీసైక్లింగ్‌ కోసం ఇతర కొనుగోలు కేంద్రాలకు పంపరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


ప్రజల అవసరాల మేరకు కోళ్లను పెంచేందుకే..

కరోనాతో భారీగా నష్టపోయిన రంగాల్లో పౌల్ట్రీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. మాంసాహారం ద్వారా కరోనా వ్యాప్తి చెందవచ్చన్న వ దంతుల నేపథ్యంలో చికెన్‌ తినేందుకు చాలా మంది నిరాసక్తత కనబరిచారు. ఒక దశలో కోళ్లను కొనేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. దీంతో కోళ్లను అతి తక్కువ ధరకు విక్రయించడం, కొన్ని చోట్ల ఉచితంగానే పంపిణీ చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల బతికి ఉన్న కోళ్లను పెద్ద పెద్ద గోతులలో పూడ్చి వేసిన ఉదంతాలు  కూడా వెలుగు చూశాయి. ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో కోళ్ల సంఖ్య పరిమితంగానే ఉంది. దీంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా కోళ్లను పెంచాలంటే.. ఆ రైతులకు సాయపడాలని గుర్తించిన ప్రభుత్వం.. అసోసియేషన్ల విజ్ఞప్తి మేరకు సబ్సిడీ మొక్కజొన్నలు అందించాలని నిర్ణయించింది.

Updated Date - 2020-05-17T08:54:21+05:30 IST