పోతిరెడ్డిపాడుతో తీవ్ర నష్టం
ABN , First Publish Date - 2020-05-13T08:33:46+05:30 IST
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అదనంగా 4 టీఎంసీల నీటిని తీసుకుపోవడానికి ఏపీ ప్రభుత్వం ఆరు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం

- తెలంగాణ ఏర్పాటు ఉద్దేశానికి విఘాతం
- పార్టీ నేతలతో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్
- ‘పోతిరెడ్డిపాడుపై’ కాంగ్రెస్ ధర్నా నేడు
హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా అదనంగా 4 టీఎంసీల నీటిని తీసుకుపోవడానికి ఏపీ ప్రభుత్వం ఆరు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం దురదృష్టకరమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యుత్తు, నిర్వహణ, మానవ శక్తి కోసం మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఏపీ ప్రభుత్వం తన్నుకుపోతుంటే సోమవారం దాకా సీఎం కేసీఆర్ నోరు మెదపలేదు’’ అని ఉత్తమ్ మండిపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్ వైఫల్యాన్ని, జగన్‌తో ఆయనకున్న సంబంధాన్ని బహిర్గతం చేస్తామని ప్రకటించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, కొవిడ్-19 తదితర అంశాలపై ఉత్తమ్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో ఆర్‌సీ ఖుంటియా, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, కుసుమ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వల్ల మొత్తం కృష్ణాబేసిన్ నీటి పారుదల వ్యవస్థ నాశనం అవుతుందని, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాలు నీటి వాటాను కోల్పోతాయన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో అన్ని న్యాయపరమైన వేదికలను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయిస్తుందని పేర్కొన్నారు. కాగా, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నానికి వ్యతిరేకంగా, దీన్ని అడ్డుకోవడంలో సీఎం కేసీఆర్ వైఫల్యానికి నిరసనగా బుధవారం టీపీసీసీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ధర్నాలు నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.