పదోన్నతుల తర్వాతే పోస్టింగ్‌లు

ABN , First Publish Date - 2020-12-30T08:05:45+05:30 IST

ఇరిగేషన్‌ శాఖ పునర్య్యవస్థీకరణ అమలు ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లకు పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని

పదోన్నతుల తర్వాతే పోస్టింగ్‌లు

ఇరిగేషన్‌ శాఖ పునర్వ్యవస్థీకరణ.. అమలుపై కసరత్తు ప్రారంభం.. ఇంజనీర్లకు నిధులు ఖర్చు చేసే అధికారం


హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌ శాఖ పునర్య్యవస్థీకరణ అమలు ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లకు పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించాల్సి ఉంటుందని గుర్తించారు. పదోన్నతులను కల్పిస్తేనే.. కొత్త సర్కిళ్లకు అవసరమైన అధికారులు అందుబాటులోకి వస్తారని భావిస్తున్నారు. కొత్త సర్కిళ్లకు కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది వంటి విషయాలపైనా దృష్టి పెట్టారు. ఈ అంశంపై మంగళారం ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ముందుగా ఇంజనీర్లకు పదోన్నతులను కల్పించి, తర్వాత వారికి పోస్టింగ్‌లను ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈఎన్‌సీలు ఐదుగురు ఉండగా ఆ పోస్టులను 6కు పెంచారు. దీంతో మరొకరికి ఈఎన్‌సీగా పదోన్నతి రానుంది. ఇక మరో ముగ్గురికి సీఈలుగా, 10 మందికి ఎస్‌ఈలుగా, 28 మందికి ఈఈలుగా, 214 మందికి డీఈఈలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది.


ప్రస్తుతం ఈ జాబితాను రూపొందిస్తున్నారు. కాగా, కొత్తగా 360 పోస్టుల్లో ఏఈఈ, ఏఈలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీ వల్ల ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.60 కోట్ల అదనపు భారం పడనుంది. ఏఈఈ, ఏఈ, జేటీవో, టీఏ, జూనియర్‌ అసిస్టెంట్ల పోస్టులను దశల వారీగా భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే సీఈ సర్కిళ్లు, ఇతర  కార్యాలయాల కోసం రూ. 320 కోట్లను కేటాయించారు. పూర్తి స్థాయి కార్యాలయాలు ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక కార్యాలయాల కోసం రూ.2.2 కోట్లను కేటాయించారు. కార్యాలయ సిబ్బంది, జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టుల భర్తీలో నిర్వాసిత కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ అమలులో భాగంగా రికార్డులను కూడా సరి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రికార్డులు, ఇతర సిబ్బందిని సమకూర్చాల్సి ఉంటుంది. 


ఇంజనీర్లకు నిధుల ఖర్చు అధికారం...

కొత్త విధానంలో భాగంగా ప్రాజెక్టులు, కాల్వల మరమ్మతు పనులకు అవసరమయ్యే నిధులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌లోనే ఈ నిధులను కేటాయించనున్నారు. ఈ నిధులను ఇరిగేషన్‌ శాఖ పేరిట కాకుండా సదరు అధికారి పోస్టు పేరిటే కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం నిధులను నేరుగా ఇంజనీర్లు వ్యయం చేసే అవకాశం లేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలాంటి నిధులను ఖర్చు చేయలేని పరిస్థితి. దీంతో అత్యవసర పనుల కోసం వెంటనే నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు నేరుగా నిధులను వ్యయం చేసే వెసులుబాటును కల్పించారు. ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఏడాదిలో వ్యయం చేయడానికి వీలుగా రూ. 280 కోట్లను అందుబాటులో ఉంచనున్నారు. 


పటిష్ఠంగా ఓఅండ్‌ఎం విభాగం..

పునర్య్వవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టుల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం)పై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఓఅండ్‌ఎంకు కావాల్సిన నిధులతోపాటు అవసరమైన సిబ్బందిని కూడా సమకూర్చాలని నిర్ణయించింది. వీరిని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించనున్నారు. ప్రాజెక్టుల ఓఅండ్‌ఎం విభాగంలో ప్రస్తుతం 1095 మంది ఉండగా.. కొత్త పద్ధతి కారణంగా మొత్తం 5,288 మంది అవసరం ఉంటుందని అంచనా వేశారు. దీంతో మరో 4326 మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించనున్నారు.


నిధుల వ్యయంపై ఇంజనీర్లకు కలిగే అధికారం

అధికారి స్థాయి  వ్యయ పరిమితి 

ఈఎన్‌సీ (జనరల్‌) రూ. కోటి నుంచి 25 కోట్లు

సీఈ రూ. 50 లక్షల నుంచి 5 కోట్లు

ఎస్‌ఈ రూ. 25 లక్షల నుంచి 2 కోట్లు

ఈఈ రూ. 5 లక్షల నుంచి 25 లక్షలు

డిప్యూటీ ఈఈ రూ. 2 లక్షల నుంచి 5 లక్షలు


ఓఅండ్‌ఎంలో కావాల్సిన అదనపు సిబ్బంది..

పోస్టు పేరు సంఖ్య

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 532

ఎలక్ట్రీషియన్లు 109

ఫిట్టర్లు 45

ఫ్లడ్‌గేట్‌ ఆపరేటర్లు 79

పంప్‌ ఆపరేటర్లు 44

జనరేటర్‌ ఆపరేటర్లు 43

వెల్డర్స్‌ 5

మెషిన్‌ ఆపరేటర్లు 1

కుక్‌ 6

వైర్‌లెస్‌ ఆపరేటర్లు 11

ల్యాబ్‌ అటెండర్లు 4

లష్కర్‌ 2874

మ్యాన్‌ మజ్దూర్‌ 39

ఉమెన్‌ మజ్దూర్‌ 12

వాచ్‌మెన్‌ 195

హెల్పర్‌ 198

స్వీపర్లు 27

మొత్తం  4,236

Updated Date - 2020-12-30T08:05:45+05:30 IST