పాలిటెక్నిక్‌లు నిర్వీర్యం!

ABN , First Publish Date - 2020-09-13T07:25:47+05:30 IST

ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే పాలిటెక్నిక్‌ కోర్సు.. రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. ఒకప్పుడు దీనిపై పదో తరగతి విద్యార్థులకు విపరీతమైన

పాలిటెక్నిక్‌లు నిర్వీర్యం!

స్పాట్‌ అడ్మిషన్ల రద్దుతో  భారీగా మిగులుతున్న సీట్లు

ప్రైవేటు కాలేజీల్లోనూ సగం సీట్ల కోత 

ప్రశ్నార్థకంగా సాంకేతిక విద్య భవిష్యత్తు 

ఈసారి అతితక్కువ దరఖాస్తులు 

కోర్సును రద్దుచేస్తారన్న అనుమానం


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే పాలిటెక్నిక్‌ కోర్సు.. రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. ఒకప్పుడు దీనిపై పదో తరగతి విద్యార్థులకు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. మూడేళ్ల డిప్లొమా తర్వాత నేరుగా ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో ప్రవేశం, ఉద్యాగాల్లో ప్రాధాన్యం ఉండడంతో అనేక మంది అందులో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకునేవారు.


ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఏడాదికి రూ.4000 లోపు ఫీజుతో కోర్సును పూర్తిచేసే అవకాశం ఉండటంతో పేద విద్యార్థులకూ అనువుగా ఉండేది. ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులతో పోలిస్తే పాలిటెక్నిక్‌తో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంజినీరింగ్‌ చేయకపోయినా కేవలం పాలిటెక్నిక్‌ అర్హతతోనే ప్రభుత్వ రంగంలోనూ అనేక ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కోర్సులపై కేంద్రప్రభుత్వం యూజీసీ, ఏఐసీటీఈ ప్రత్యేకంగా దృష్టిసారించి వీటి సంఖ్యను పెంచుతుండగా.. రాష్ట్రంలో మాత్రం సీట్లను తగ్గిస్తున్నారు.


కాలేజీల్లో వసతులు కల్పించకపోవడం, సరిపడా సిబ్బందిని నియమించకపోవడం లాంటి కారణాలతో సాంకేతిక విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2018లో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో కలిపి మొత్తం 53,590 సీట్లు ఉండగా.. ఇప్పుడు 145 పాలిటెక్నిక్‌లలో 34,901 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 11,546, ఎయిడెడ్‌ 300, ప్రైవేటులో 23,055 చొప్పున ఉన్నాయి. 


స్పాట్‌ అడ్మిషన్లు ప్రైవేటుకే ఎందుకు..? 

గతంలో రెండు, మూడు విడతల్లో పాలిటెక్నిక్‌ ప్రవేశాలు జరిగేవి. మిగిలిన సీట్లకు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించేవారు. దీంతో ఖాళీలన్నీ వెంటనే నిండిపోయేవి. కానీ, రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని రద్దుచేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలన్నీ కౌన్సెలింగ్‌ ద్వారానే చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. స్పాట్‌ అడ్మిషన్లను కేవలం ప్రైవేటుకే పరిమితం చేశారు.


దీంతో గత ఏడాది మొత్తం 11,546 ప్రభుత్వ సీట్లలో దాదాపు 20 శాతం మిగిలిపోయాయి. పాలిటెక్నిక్‌ పూర్తిచేసి ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థుల కోసం ప్రైవేటు కాలేజీల్లో ప్రతి కోర్సులో 20శాతం సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది దీనిని 10శాతానికి తగ్గించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో సీట్లు తగ్గటంతో విద్యార్థులు ఇటువైపు రావడానికి వెనుకాడుతున్నారు.


ఈ సారి అగ్రికల్చర్‌ కలుపుకొని 73,920 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. పాలిటెక్నిక్‌పై సాంకేతిక విద్యాశాఖ పదోతరగతి విద్యార్థులకు రెండేళ్లుగా అవగాహన కల్పించకపోవడాన్ని చూస్తే ఈ కోర్సును క్రమక్రమంగా రద్దు చేస్తారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 


నాలుగేళ్లలో  పాలీసెట్‌ దరఖాస్తులు


2017 : 1,27,689  

2018 : 1,21,393  

2019 : 1,03,591 

2020 : 73,920 

(అగ్రికల్చర్‌ కలుపుకొంటే)  


Updated Date - 2020-09-13T07:25:47+05:30 IST