అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం

ABN , First Publish Date - 2020-03-02T09:34:07+05:30 IST

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌, తమ పార్టీ

అన్ని వర్గాలకు  రాజకీయ ప్రాతినిధ్యం

అదే సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ లక్ష్యం

సామాజిక న్యాయానికి మరోసారి పెద్దపీట

డీసీసీబీ ఎన్నికల్లో పదవులపై మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌, తమ పార్టీ లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల విషయంలో సామాజిక న్యాయానికి మరోసారి పెద్దపీట వేశామన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో బడుగు బలహీనవర్గాలకు నిర్దేశించిన రిజర్వేషన్ల కన్నా ఎక్కువ అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సహకార సంఘాల ఎన్నికల ద్వారా రైతులు సీఎం కేసీఆర్‌ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటిచారని పేర్కొన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికల్లో బలహీనవర్గాలకు పదవులను కేటాయించిన వివరాలను టీఆర్‌ఎస్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.


మొత్తం 36 పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు  17 కేటాయించామని తెలిపింది. బీసీల్లో మున్నూరు కాపు, ముదిరాజ్‌, మైనారిటీ, పెరిక, లింగాయత్‌లకు అవకాశం కల్పించామని వెల్లడించింది. డీసీసీబీ చైర్‌పర్సన్లుగా ఆదిలాబాద్‌లో ఎస్సీ, ఖమ్మంలో యాదవ, మహబూబ్‌నగర్‌లో మైనారిటీ, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్లుగా నల్లగొండలో యాదవ, వరంగల్‌లో ఎస్టీ, నిజామాబాద్‌లో మున్నూరు కాపు, మెదక్‌ లింగాయత్‌ వర్గాలకు చెందిన నేతలకు కేటాయించామని తెలిపింది. 


సంఘాల నేతల హర్షం!

సహకార సంఘాల ఎన్నికల్లో బడుగు, బలహీనవర్గాలకు టీఆర్‌ఎస్‌ పెద్దపీట వేసిందని పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బడుగు, బలహీనవర్గాలకు పదవులు ఇవ్వడం హర్షణీయమని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్వాల జితేందర్‌ అన్నారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేయడంలో భాగంగానే నలుగురు గిరిజనులకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లుగా అవకాశం దక్కిందని గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్‌ తెలిపారు. గిరిజనులకు అవకాశం ఇచ్చినందుకు టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2020-03-02T09:34:07+05:30 IST