పోలీస్ నిఘాలో దుబ్బాక
ABN , First Publish Date - 2020-10-31T09:25:15+05:30 IST
ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా పోలీసు కనుసన్నల్లో ఉంది. నవంబరు 3వ తేదీన పోలింగ్ ఉండడంతో

ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు
రంగంలోకి పారా మిలిటరీ బలగాలు
1,702 మంది సిబ్బందితో పహారా
నవంబరు 3న పోలింగ్ దృష్ట్యా అప్రమత్తం
సిద్దిపేట, ఆంధ్రజ్యోతి, అక్టోబరు 30: ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా పోలీసు కనుసన్నల్లో ఉంది. నవంబరు 3వ తేదీన పోలింగ్ ఉండడంతో నిఘాను తీవ్రతరం చేశారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు కేంద్ర పారా మిలిటరీ బలగాలనూ రంగంలోకి దించారు. ఇటీవలి ఘటనల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. బందోబస్తు నిర్వహణకు వివిధ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది 1,702 మంది దుబ్బాక చేరుకున్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రత్యేక బృందాలను నియమించారు. 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 7 మండలాలకు గాను మండలానికి రెండు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. ప్రత్యేకాధికారి, తమిళనాడు సైబర్ క్రైం విభాగం డీసీపీ సరోజ్‌కుమార్ ఠాకూర్ వచ్చీరాగానే తన ఫోన్ నంబర్ అందరికీ తెలిసేలా చేశారు. ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. తనదైన శైలిలో పరిస్థితులను విశ్లేషిస్తున్నారు.
అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 89
148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలకు గాను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 89 పోలింగ్ కేందాల్ర వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలను నియమించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. ప్రతి కేంద్రాన్ని జియో ట్యాగింగ్ చేశారు. 70 చోట్ల వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికను పర్యవేక్షించనున్నారు. కొవిడ్ -19 నిబంధనల మేరకు పోలింగ్ నిర్వహించనున్నారు. బారులు తీరకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రాలను పెంచారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుంది. శానిటైజర్‌ను సైతం వెంట తెచ్చుకోవాలని కోరుతున్నారు.
ఇదీ బలగాల లెక్క
ఒక కంపెనీ సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్; రెండు కంపెనీల ఏపీ స్పెషల్ పోలీస్ బలగాలు (వీరంతా 300 మంది ఉన్నారు.). రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 550 మంది పోలీస్ సిబ్బంది.
సిద్దిపేట సీపీ ఆధ్వర్యంలో
నలుగురు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 43 మంది ఏఎ్‌సఐలు, 231 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,010 మంది కానిస్టేబుళ్లు, 100 మంది హోంగార్డులు, 30 మంది ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు.