కారుపై పోలీస్‌ స్టికర్‌.. లోపల లిక్కర్‌

ABN , First Publish Date - 2020-05-09T13:23:46+05:30 IST

కారుపై పోలీస్‌ స్టికర్‌.. లోపల లిక్కర్‌

కారుపై పోలీస్‌ స్టికర్‌.. లోపల లిక్కర్‌

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు     

హైదరాబాద్‌: కారుపై పోలీస్‌ స్టిక్కర్‌.. నకిలీ నంబర్‌ ప్లేట్‌.. టోల్‌ గేట్‌ వద్ద డిపార్టుమెంట్‌ మనుషులమని దబాయింపు. ఇదీ వారి దర్పం. కారులో లిక్కర్‌ బాటిళ్లు పెట్టుకుని తిరుగుతున్న ఇద్దరి అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగారానికి చెందిన భరత్‌గౌడ్‌, కుషాయిగూడ కమలానగర్‌కు చెందిన వెంకటేశ్వరరావు అలియాస్‌ వాసు చౌదరీ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి టాటా సఫారి వాహనంతో కట్టడి ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కమిషనరేట్‌ పరిధిలో ఉన్న టోల్‌గేట్‌ల వద్ద డిపార్టుమెంట్‌ వాళ్లమని చెప్పి టోల్‌ఫీజు చెల్లించడం లేదు.  సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు కీసర పరిధిలోని చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో రెండు లిక్కర్‌ బాటిళ్లు ఉన్నట్లు, ఆ కారుకున్న నంబర్‌ప్లేట్‌ నకిలీదిగా గుర్తించారు. ఆ వాహనం విశాఖపట్నానికి చెందిన బాలాజీదిగా పోలీసులు తేల్చారు. స్నేహితుడైన బాలాజీ నుంచి మూడు నెలల పాటు వాహనం అవసరం ఉందని వాహనం తెచ్చుకున్న నిందితులు ఏపీ07బీఎం5555 (అసలు నంబర్‌ఏపీ31ఈఎఫ్0887)గా నకిలీ నంబర్‌ ప్లేట్‌ను అమర్చారు. ఆ యువకులను కీసర పోలీసులకు అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-09T13:23:46+05:30 IST