పోలీసు వాహనంలో తిరుగుతూ..ఏటీఎంలను కొల్లగొట్టారు

ABN , First Publish Date - 2020-12-25T07:58:53+05:30 IST

పోలీసు వాహనాన్ని దొంగిలించి.. అందులో తిరుగుతూ.. ఏటీఎంలను కొల్లగొట్టిన గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు

పోలీసు వాహనంలో తిరుగుతూ..ఏటీఎంలను కొల్లగొట్టారు

5 రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌.. ముఠా ఆట కట్టించిన రాచకొండ పోలీసులు

ఆరుగురిని అరెస్టు చేసిన సీసీఎస్‌, ఎస్వోటీ

రూ. 20.28 లక్షల సొత్తు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలీసు వాహనాన్ని దొంగిలించి.. అందులో తిరుగుతూ.. ఏటీఎంలను కొల్లగొట్టిన గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు రాష్ట్రాల పోలీసులకు ఈ గ్యాంగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ కావడం గమనార్హం. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలను వెల్లడించారు. హరియాణాకు చెందిన మునాజిర్‌ అలియాస్‌ మున్నా మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి.. ఆటోనగర్‌ లారీ ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేసేవాడు. అక్కడే ఓ ఇంజనీరింగ్‌ వర్క్స్‌లో హరియాణాకు చెందిన జహీర్‌ఖాన్‌ పనిచేస్తున్నాడు. వీరిద్దరికీ హరియాణా దొంగల ముఠాతో సంబంధాలున్నాయి. దీంతో.. ముఠా నాయకుడు వారీ్‌సఖాన్‌, ముఠా సభ్యులు వాహిద్‌ఖాన్‌, మోహిన్‌ఖాన్‌, ముఫీద్‌ఖాన్‌, ఖాదర్‌ఖాన్‌, హరీశ్‌, ఇర్ఫాన్‌తో కలిసి నగరంలో ఏటీఎంల చోరీకి పథకం పన్నారు. మున్నా, జహీర్‌ నగరంలోని ఏటీఎంలలో తిరిగి.. చోరికి అనుకూలంగా ఉన్నవి గుర్తిస్తే.. వారీ్‌సఖాన్‌ తన గ్యాంగ్‌తో రంగంలోకి దిగేవాడు.


లారీల్లో వస్తారు.. విమానాల్లో వెళ్తారు

వారీ్‌సఖాన్‌ తన ముఠాతో కలిసి టార్గెట్‌గా ఎంచుకున్న నగరాలకు లారీల్లో వస్తాడు. లోకల్‌గా ఓ కారును దొంగిలించి అందులో తిరుగుతూ.. ఏటీఎం యంత్రాలను గ్యాస్‌ కట్టర్‌లతో కత్తిరించి, కొల్లగొడతారు. తమను ఎవరూ గుర్తించకుండా.. సీసీ టీవీ కెమెరాలకు నల్లరంగు పూస్తారు. చోరీ చేశాక.. సుమారు 200 కిలోమీటర్ల దూరం వరకు అదే కారులో వెళ్లిపోతారు. అక్కడి నుంచి విడిపోయి.. కొందరు విమానాల్లో, మరికొందరు రైళ్లలో, ఇంకొందరు లారీల్లో ఢిల్లీకి వెళ్తారు. హరియాణాలో అంతా కలుసుకుని, చోరీ సొత్తును పంచుకుంటారు. ఇలా ఈ ముఠా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడి.. పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉంది.


పోలీసు వాహనం చోరీ చేసి..

వారీ్‌సఖాన్‌ ముఠా ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి.. వనస్థలిపురంలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ డిటెన్షన్‌ (పీడీ) విభాగం సలహాదారు దామోదర్‌కు చెందిన పోలీసు వాహనాన్ని దొంగిలించింది. అబ్దుల్లాపూర్‌ మెట్‌ వద్ద ఉన్న ఏటీఎంను గ్యాస్‌ కటర్‌తో కత్తిరించి.. రూ. 35 వేలు కొల్లగొట్టింది. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టిసారించారు. ఏటీఎం కేంద్రంలో, వాహనంలో లభించిన వేలిముద్రలు ఒకేలా ఉండడంతో.. ఇది హరియాణా ముఠా పనే అని నిర్ధారించుకున్నారు. నాగ్‌పూర్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వారీస్‌ ఖాన్‌, మోహిన్‌ ఖాన్‌, వహీద్‌ ఖాన్‌, మున్నా, ముఫీద్‌ ఖాన్‌, జహీర్‌ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఖాదర్‌ఖాన్‌, హారిష్‌, ఇర్ఫాన్‌ పరారీలో ఉన్నారు. ఈ ముఠా నుంచి పోలీసు వాహనం, రూ. 73 వేల నగు, లారీ, ద్విచక్రవాహనం, రూ. 20.28 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐదు రాష్ట్రాల్లో 11 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-12-25T07:58:53+05:30 IST