పోలీస్‌ నియామకాలపై సందిగ్ధం

ABN , First Publish Date - 2020-12-17T08:29:58+05:30 IST

పోలీస్‌ శాఖ నుంచి మరోసారి జంబో నోటిఫికేషన్‌ రాబోతోంది. పలు విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిల్లో 19,700 పోస్టుల భర్తీకి

పోలీస్‌ నియామకాలపై సందిగ్ధం

నోటిఫికేషన్‌ ఇచ్చేదెలా?.. స్పష్టత కరువు

ఉమ్మడి జిల్లాలా.. లేక కొత్త జిల్లాలతోనా!

పాత జిల్లాల ప్రాతిపాదికనే ఖాళీల వివరాలు

అలా భర్తీ చేస్తే చట్టప్రకారం మరిన్ని ఇబ్బందులు

స్పష్టత ఇవ్వాలని జీఏడీకి పోలీస్‌ శాఖ లేఖ


హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖ నుంచి మరోసారి జంబో నోటిఫికేషన్‌ రాబోతోంది. పలు విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయిల్లో 19,700 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోలీస్‌ నియామకాలకు పూర్తి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేయడమే ఇక తరువాయి. అయితే.. ఇక్కడే కొత్త చిక్కొచ్చి పండింది.  నోటిఫికేషన్‌ను ఉమ్మడి జిల్లాల ప్రకారం ఇవ్వాలా? కొత్త జిల్లాల ప్రకారం ఇవ్వాలా? అన్న అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత లేకుండా పోయింది. వాస్తవానికి పోలీస్‌ శాఖ ఉమ్మడి పది జిల్లాల ప్రకారమే ఖాళీల వివరాలు సేకరించింది. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసింది.


గతంలోనూ ఉమ్మడి 10 జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్‌ జారీ చేసి నియామకాలు చేపట్టారు. అయితే ఈ సారికూడా అదే పద్ధతి అనుసరిస్తే చట్టప్రకారం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు కొత్త జిల్లాలు, జోనల్‌ వ్యవస్థకు సంబంధించి ఇప్పటి వరకూ రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. దీంతో.. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగాని(జీఏడీ)కి పోలీ్‌సశాఖ లేఖ రాసింది. సంబంధిత ఫైల్‌ జీఏడీ వద్ద పెండింగ్‌లో ఉంది. జీఏడీ అధికారులు న్యాయశాఖ సలహా తీసుకోవడం లేదా అవసరమైతే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను సంప్రదించి వారి సలహా మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.


కొత్త జిల్లాల ఖాళీల వివరాల్లేవు

కొత్త జిల్లాల ప్రకారం నియామకాలు జరగాలంటే నిబంధనల ప్రకారం కొత్త జిల్లాల్లోని ఖాళీల వివరాలు కచ్చితంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం పోలీస్‌ శాఖలో ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లాల్లో కొన్ని రెండు, మరికొన్ని మూడు, నాలుగు జిల్లాలుగా ఏర్పడ్డాయి. సత్వర సేవలు అందించడంలో భాగంగా ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ సిబ్బందిని సర్దుబాటు చేశారు. ప్రస్తుతం అలాగే కొనసాగుతున్నారు. దీంతో కొత్త జిల్లాల్లో మంజూరైన పోస్టులు, సిబ్బంది, ప్రస్తుతం విధుల్లో ఎందరు ఉన్నారు, ఖాళీలు.. ఇలా పూర్తి వివరాలు పోలీస్‌ శాఖ వద్ద లేవు. ఇటీవల కూడా ఉమ్మడి పది జిల్లాల ప్రకారమే ఖాళీల వివరాలు సేకరించారు. అలాగే, ఈ సారి ప్రభుత్వానికి పంపిన ఖాళీల వివరాల్లో కేవలం సివిల్‌, ఏఆర్‌ తదితర విభాగాలకు సంబంధించిన సమాచారం మాత్రమే అందించారు. అగ్ని మాపకశాఖ, జైళ్లు, ఇతర విభాగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు అందించలేదు. గత నోటిఫికేషన్‌లో అగ్నిమాపక, జైళ్ల శాఖలో ఖాళీల్ని భర్తీ చేశారు.


మంజూరైన పోస్టులన్నీ భర్తీ చేసే యోచన

పోలీస్‌ శాఖ పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకూ సిబ్బంది కొరత వల్ల కొద్దిమందిపైనే పని భారం పడేది. ఇకపై అలా కాకుండా శాంక్షన్డ్‌ స్ర్టెంత్‌ మొత్తం ఉండేలా ఖాళీలు భర్తీ చేయనున్నారు. తెలంగాణకు సివిల్‌-42 వేలు, ఏఆర్‌-22 వేలు, టీఎ్‌సఎ్‌సపీ-13వేలు, ఇతరత్రా మరో 10 వేల పోస్టులున్నాయి. గతంలో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి సుమారు 16 వేల పోస్టులు భర్తీ చేశారు. శాంక్షన్డ్‌ పోస్టుల్లో ఇంకా మిగిలిన 20 వేల పోస్టులను తాజా నోటిఫికేషన్‌లో భర్తీ చేయనున్నారు.

Updated Date - 2020-12-17T08:29:58+05:30 IST