‘ఆంధ్రజ్యోతి’ పొలిటికల్ బ్యూరో చీఫ్‌పై పోలీసు దాడి
ABN , First Publish Date - 2020-03-24T10:54:08+05:30 IST
‘‘లాక్‌డౌన్ సమయంలో మీడియా మిత్రులు తిరగవచ్చు. వాళ్ల డ్యూటీలో వాళ్లుంటరు కాబట్టి.. వార్తలు సేకరించాలె కాబట్టి వాళ్ల వరకూ తిరగవచ్చు. వాళ్లనెవరూ ఆపరు. వాళ్లనెవరూ కూడా

కర్ఫ్యూ పేరుతో అకారణంగా కొట్టిన అంబర్‌పేట ఎస్సై
విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఘటన
శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్న సీపీ
(హైదరాబాద్ సిటీ- ఆంధ్రజ్యోతి)
‘‘లాక్‌డౌన్ సమయంలో మీడియా మిత్రులు తిరగవచ్చు. వాళ్ల డ్యూటీలో వాళ్లుంటరు కాబట్టి.. వార్తలు సేకరించాలె కాబట్టి వాళ్ల వరకూ తిరగవచ్చు. వాళ్లనెవరూ ఆపరు. వాళ్లనెవరూ కూడా నిరోధించకూడదు.’’
..రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ ప్రకటన చేసిన సమయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి! కానీ, వాస్తవంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. విధులు ముగించుకుని అర్ధరాత్రి వేళ ఇళ్లకు వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఐడీ కార్డులు చూపినా కూడా అనుమతించకుండా వంకలు పెడుతున్నారు. చేతిలో లాఠీ ఉంది కదాని చెలరేగిపోతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్, సీనియర్ పాత్రికేయుడు మెండు శ్రీనివా్‌సపై అంబర్‌పేట ఎస్సై లింగం సోమవారం రాత్రి ఇలాగే అకారణంగా దాడి చేసి కొట్టారు. రామంతాపూర్ విశాల్ మార్ట్ వద్ద జరిగిందీ ఘటన. అక్కడ బారికేడ్‌లు ఏర్పాటు చేసిన పొలీసులు.. విధులు ముగించుకుని బండిపై ఇంటికి వెళ్తున్న మెండు శ్రీనివా్‌సను ఆపి వివరాలు అడిగారు. శ్రీనివాస్ ఆ అధికారికి తన ఐడీ కార్డు చూపి, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లేందుకు ఆ అధికారి అంగీకరించారు. కానీ, శ్రీనివాస్ అక్కడి నుంచి బయల్దేరేలోపలే..
అంబర్ పేట ఎస్సై లింగం వెనక నుంచి విసురుగా వచ్చారు. రావడం రావడమే ఎలాంటి వివరాలూ అడగకుండా.. ఏం చెబుతున్నా వినిపించుకోకుండా.. పాత్రికేయుడినని చెబుతున్నా పట్టించుకోకుండా.. శ్రీనివా్‌సను లాఠీతో గట్టిగా కొట్టారు. ‘‘పాత్రికేయులు విధులు నిర్వర్తించేందుకు సీఎం కేసీఆర్ అనుమతించారు కదా? ఇలా ఎందుకు కొడుతున్నారు’’ అని ప్రశ్నిస్తే.. ‘ఏంది.. ఆర్గ్యూ చేస్తున్నావు? ఎల్లిపో’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో మెండు శ్రీనివాస్ ఆయనపై డీజీపీకి, సీపీకి ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి బేగంపేట వద్ద కూడా పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ తెలంగాణ బ్యూరో చీఫ్‌పై పోలీసు దాడిని టీయూడబ్యూజే143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ యోగానంద్, నవీన్ కుమార్ యార తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరిపై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ అన్నారు.
శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం : సీపీ
మెండు శ్రీనివా్‌సపై పోలీసుల దాడిని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తప్పుబట్టారు. ప్రజల మేలు కోసం నిత్యం శ్రమిస్తున్న జర్నలిస్టులపై దాడి జరడం సరైన పద్ధతి కాదని పోలీసులకు సూచించారు. జర్నలి్‌స్టపై దాడి చేసిన ఎస్సై లింగంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.