సుక్క పడితే చుక్కలే..!
ABN , First Publish Date - 2020-12-31T04:07:04+05:30 IST
సుక్క పడితే చుక్కలే..!
నేడు జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్
తనిఖీల్లో భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసులు
కృష్ణకాలనీ (భూపాలపల్లి), డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ప్రత్యేక నజర్ వేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో మందు సేవించి, చిందులేసే యువతపై ఖాకీలు కఠిన చర్యలకు పూనుకోనున్నారు. డిసెంబర్ 31 వేడుకల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయని భావించిన పోలీసులు విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్‌పై దృష్టి పెట్టనున్నారు. జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పోలీసులతో పాటు సబ్ డివిజన్‌లోని గణపురం, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి పోలీసులు ప్రధాన కూడళ్లలో తనిఖీలను చేయనున్నారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలతో భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు నేతృత్వంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌సెంటర్‌తో పాటు ప్రధాన సెంటర్లలో మద్యం సేవించి చిక్కిన వారికి బ్రీత్‌ఎనలైజర్ ద్వారా తనిఖీలు చేపట్టి పట్టుబడిన వాహనాలను స్టేషన్‌కు తరలించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.