ఆదిలాబాద్: గన్ కల్చర్‌పై పోలీసుల అలర్ట్

ABN , First Publish Date - 2020-12-19T15:38:58+05:30 IST

ఆదిలాబాద్: జిల్లాలో గన్, తల్వార్‌ దాడి ఘటనను పోలీసులు సీరియస్ తీసుకున్నారు.

ఆదిలాబాద్: గన్ కల్చర్‌పై పోలీసుల అలర్ట్

ఆదిలాబాద్: జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ (48) ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో ఇద్దరి శరీరంలోకి బుల్లెట్‌లు దూసుకుపోగా, మరొకరికి తలకు పెద్ద కత్తి గాటుపడింది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అదిలాబాద్ జిల్లాలో తొలి సారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడు ఫారూఖ్ అహ్మద్ గన్ లైసెన్స్ రద్దు చేశారు. అలాగే జిల్లాలోని ఇతర లైసెన్స్డ్ తుపాకుల ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. నిందితుడు ఫారూఖ్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ సయ్యద్ జమీర్, మోతిషిన్‌ల శరీరంలోనే తూటాలు ఉన్నాయి. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫారూఖ్‌ గతేడాది మున్సిపల్‌ ఎన్నికల్లో తాటిగూడ 22వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ వార్డులోనే ఉండే మన్నన్‌ (52), జమీర్‌ (55) టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడంతోనే తాను ఓడిపోయానని భావించిన అతడు వారిపై కోపం పెంచుకున్నాడు.


శుక్రవారం ఫారూఖ్‌ ఇంటి ఎదుట ఉన్న స్థలంలో మన్నన్‌ కుమారుడు మోథెషిన్‌ (20) మరికొందరు పిల్లలు క్రికెట్‌ ఆడుతూ గొడవపడసాగారు. తమ వారెవరూ లేకున్నా అందులో ఫారూఖ్‌ కలుగజేసుకున్నాడు. ప్రతిగా మన్నన్‌, జమీర్‌ కూడా రావడంతో వారి మధ్య మాటమాట పెరిగింది. పట్టరాని కోపంతో ఫారూఖ్‌.. మన్నన్‌, మోథెషిన్‌, జమీర్‌పై 0.32 తుపాకీతో కాల్పులకు దిగాడు. తల్వార్‌తో దాడి చేశాడు.


జమీర్‌ పొట్టలో బుల్లెట్‌ దిగింది. మరొకటి చేతికి తాకింది. మోథెషిన్‌కూ పొట్టలో బుల్లెట్‌ దిగింది. వీరిని హైదరాబాద్‌ తరలించారు. తల్వార్‌ తగిలి మన్నన్‌ తలకు గాయమైంది. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫారూఖ్‌ అహ్మద్‌ను అరెస్టు చేసి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. తుపాకీని స్వాధీనం చేసుకుని ఆయుధాల చట్టం 307, 327 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Read more