నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు

ABN , First Publish Date - 2020-12-25T07:49:30+05:30 IST

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి (మూడో) విడత నిధుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం దేశవ్యాప్తంగా రూ.2 వేల చొప్పున

నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు

ఈ ఏడాదికి చివరి విడత కేంద్ర ప్రభుత్వ సాయం

రాష్ట్రవ్యాప్తంగా 39.17 లక్షల మంది లబ్ధిదారులు

రూ.18 వేల కోట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి 

ప్రతి రైతుకు రూ.2 వేల చొప్పున జమ

ఇప్పటిదాకా ఆరు విడతల్లో నగదు పంపిణీ 


హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి (మూడో) విడత నిధుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం దేశవ్యాప్తంగా రూ.2 వేల చొప్పున జమచేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. క్రిస్మస్‌ రోజు రైతులతో తాను వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే సమయంలోనే పీఎం-కిసాన్‌ నిధుల పంపిణీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీట నొక్కనున్నారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


ఈ పథకం కింద రాష్ట్రంలో 39.17 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో సాంకేతిక సమస్యల కారణంగా సగటున 37.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. ఈ లెక్క ప్రకారం రాష్ట్ర రైతాంగం ఖాతాల్లో పీఎం- కిసాన్‌ పథకంలో భాగంగా ఈ ఏడాది మూడో విడతకు రూ.750 కోట్లు పడనున్నాయి. ప్రతి ఏడాదిలో మూడు విడతలుగా, ఒక్కో విడతకు రూ.2 వేల చొప్పున, ఏడాదికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌-జూలై మధ్యలో మొదటి విడత, ఆగస్టు నుంచి నవంబరు మధ్యలో రెండో విడత, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడో విడత చెల్లింపులు చేస్తోంది. ఈ వార్షిక సంవత్సరానికి గాను (2020- 21) ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో కేంద్రం డబ్బులు జమ చేసింది. 


జమకాగానే రైతులకు సమాచారం

పీఎం-కిసాన్‌ పథకంలో లబ్ధిదారులుగా నమోదైన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తున్నారు. పీఎం-కిసాన్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాగానే బ్యాంకుల నుంచి కూడా వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెళుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అప్‌లోడ్‌ చేసిన వివరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది.

Updated Date - 2020-12-25T07:49:30+05:30 IST