పార్కుల్లో ప్లాట్లు

ABN , First Publish Date - 2020-07-28T07:04:44+05:30 IST

మా కాలనీ పార్కులను కాపాడండి. నకిలీ పత్రాలు, నకిలీ జీపీఏలతో పార్కుల్లో ప్లాట్లు చేసి రూ.50 కోట్ల విలువైన భూమిని కబ్జా

పార్కుల్లో ప్లాట్లు

  • రాజేందర్‌రెడ్డి నగర్‌లో రూ.50 కోట్ల విలువైన స్థలాలు కబ్జా
  • నకిలీ జీపీఏ పత్రాలతో ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులు
  • అధికార పార్టీ నేతల దందా
  • కాపాడాలంటూ మంత్రి కేటీఆర్‌కు సంక్షేమ సంఘం వేడుకోలు


మియాపూర్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘‘మా కాలనీ పార్కులను కాపాడండి. నకిలీ పత్రాలు, నకిలీ జీపీఏలతో పార్కుల్లో ప్లాట్లు చేసి రూ.50 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆక్రమణను వెంటనే నిలిపివేయండి’’ అంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌ డివిజన్‌ పరిధిలోని రాజేందర్‌ రెడ్డినగర్‌ కాలనీ వాసులు, సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు విన్నవించారు. ఇందుకు కారణం.. కబ్జా వెనక అధికార పార్టీ నేతలే ఉండడం. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుండడమే! సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం కబ్జా కథ ఇది.. చందానగర్‌ గ్రామ సర్వే నంబర్‌ 259, 263, 264లోని 19.20 ఎకరాలను తన తమ్ముడు, కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి, మహేశ్వర్‌ గౌడ్‌, మానయ్యలతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి 1997-98లో కొనుగోలు చేశారు. తన అన్నయ్య రాజేందర్‌ రెడ్డి పేరిట లేఔట్‌ వేశారు. సదరు రాజేందర్‌ రెడ్డి నగర్‌లో 227 ప్లాట్‌లను వేశారు. అప్పట్లో గజం అయితే రూ.500 నుంచి 1000 చొప్పున, ఏకమొత్తంగా ప్లాటు అయితే లక్ష నుంచి లక్షన్నర చొప్పున విక్రయించారు. గ్రీన్‌బెల్ట్‌తోపాటు మూడు పార్కులకు కలిపి మొత్తం మూడు ఎకరాలు కేటాయించారు. దాదాపు 22 ఏళ్లు గడిచాయి. ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం ధర 50 వేలకు ఎగబాకింది. దాంతో, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతోనే కబ్జాదారులు పార్కుల స్థలాలపై కన్నేశారు. గ్రీన్‌బెల్డ్‌ ఏరియాతోపాటు రెండు పార్కుల్లో ప్లాట్లు వేశారు. లే అవుట్ల సంఖ్యను 262కు పెంచేశారు. జీపీఏ హోల్డర్ల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి 2002లోనే ఎల్‌ఆర్‌ఎస్‌, ఇంటి నిర్మాణానికి అనుమతులు కూడా తీసుకున్నారు. అప్పటి నుంచే సంక్షేమ సంఘం తరఫున కబ్జాదారులపై పోరాటం మొదలు పెట్టారు. కబ్జాదారులను అడ్డుకోవడానికి 2016లో జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్రమంగా ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకున్న 30 మంది ప్లాట్ల యజమానులకు ఎన్‌జీటీ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. పార్కు స్థలమంటూ బోర్డులు ఏర్పాటు చేసి.. ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గత ఏడాది హెచ్చరించింది. కానీ, కరోనా కాలాన్ని కబ్జాదారులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బోర్డులు తీసేసి.. ుఈ స్థలం మాది’ అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టు ఫెన్సింగ్‌ కూడా వేశారు. దాంతో, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. మరోసారి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.



పార్కు స్థలాన్ని కాపాడండి

కాలనీలో గ్రీన్‌బెల్డ్‌ ఏరియా, పార్కుల కోసం కేటాయించిన స్థలాలను మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ కాపాడాలి. నకిలీ పత్రాలతో జీపీఏలు సృష్టించి దాదాపు మూడెకరాల ఖాళీ స్థలంలో 35 ప్లాట్లను వేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతులు తీసుకున్నారు. పార్కులను కాజేయడానికి ప్రయత్నిస్తున్న కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అనుమతులు రద్దుచేయాలి. 

- రఘుపతి రెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షుడు



Updated Date - 2020-07-28T07:04:44+05:30 IST