ప్లాస్మా దానానికీ లెక్కుంది!
ABN , First Publish Date - 2020-07-18T08:06:48+05:30 IST
కరోనా సోకి, తీవ్ర లక్షణాలున్నవారికి ప్లాస్మాథెరపీతో తక్కువ ఖర్చుతో వైద్యం చేయొచ్చని.. కాబట్టి, ఇప్పటికే కరోనాను జయించినవారు ప్లాస్మా దానం చేయాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. కానీ.. కరోనాపై పోరులో భాగంగా మన రోగనిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు ఎక్కువకాలం ఉండవని, వైరస్ బారిన పడి

- ఇటీవలే కరోనాను జయించిన వారి నుంచి సేకరిస్తేనే ఎక్కువ ఉపయోగం
- 2 నెలల తర్వాత తగినన్ని యాంటీబాడీలుండవు
- బ్రిటన్, నార్వే, ఎస్తోనియా శాస్త్రజ్ఞుల అధ్యయనం
(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి)
కరోనా సోకి, తీవ్ర లక్షణాలున్నవారికి ప్లాస్మాథెరపీతో తక్కువ ఖర్చుతో వైద్యం చేయొచ్చని.. కాబట్టి, ఇప్పటికే కరోనాను జయించినవారు ప్లాస్మా దానం చేయాలని వైద్యులు పిలుపునిస్తున్నారు. కానీ.. కరోనాపై పోరులో భాగంగా మన రోగనిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు ఎక్కువకాలం ఉండవని, వైరస్ బారిన పడి కోలుకున్న కొన్ని నెలల తర్వాత తగినన్ని యాంటీబాడీలు శరీరంలో ఉండట్లేదని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ శాస్త్రజ్ఞుల అధ్యయనంలో తేలింది! దీంతో, సాధారణ జలుబులాగానే కొవిడ్-19 కూడా మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ చికిత్సకు అవసరమైన ప్లాస్మాను ఇటీవలికాలంలో వైరస్ బారిన పడి కోలుకున్నవారి నుంచే సేకరించాలని అప్పుడే ఉపయోగం ఉంటుందని నార్వే, ఎస్తోనియా శాస్త్రజ్ఞుల అధ్యయనంలో కూడా తేలింది. ఆ అధ్యయన ఫలితాలను ‘వైరసెస్’ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రజ్ఞులు కొవిడ్-19 సెల్ కల్చర్స్‌కు.. వైరస్ బారిన పడి కోలుకున్న పలువురి నుంచి సేకరించిన ప్లాస్మాను జోడించారు. వెంటనే ఆ ప్లాస్మాలోని యాంటీబాడీలు వైర్‌సను నిర్వీర్యం చేయడం ప్రారంభించాయి. అయితే.. వైర్‌సను జయించి ఎక్కువ కాలం అయినవారి నుంచి సేకరించిన ప్లాస్మాలోని యాంటీబాడీల కన్నా, ఇటీవలే వైరస్ బారిన పడి కోలుకున్నవారి ప్లాస్మాలోని యాంటీబాడీలు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న రెండునెలల తర్వాత సేకరించే ప్లాస్మాలో.. కరోనాతో యుద్ధం చేసేందుకు కావాల్సినన్ని యాంటీబాడీలు లేవని తేలింది. అందుకే వైద్యులు, ఆస్పత్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పరిశోధకులు సూచించారు.
ప్లాస్మాను ఎవరు దానం చేయొచ్చు?
రక్తదానానికి వర్తించే షరతులే దీనికీ వర్తిస్తాయి. 18 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్నవారు, 50 కిలోలకు పైగా బరువున్న కరోనా విజేతలే ప్లాస్మాదానానికి అర్హులు. అది కూడా.. వైరస్ నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాతే ప్లాస్మాను దానం చేయాలి. ప్రస్తుతం తాము దాతల నుంచి 28 రోజుల తర్వాతే ప్లాస్మాను సేకరిస్తున్నామని కిమ్స్ ఆస్పత్రికి చెందిన రుమటాలజిస్టు డాక్టర్ శరత్ చంద్రమౌళి తెలిపారు. 14 రోజుల తర్వాత కూడా ప్లాస్మాను సేకరించవచ్చుగానీ.. అలా సేకరించడానికి ముందు వారికి మరోసారి కొవిడ్-19 టెస్టు చేసి, అందులో కూడా నెగెటివ్ వస్తేనే వారి నుంచి ప్లాస్మా తీసుకుంటామని ఆయన వివరించారు.
ఎవరు అనర్హులు?
కరోనాను జయించినా సరే..
- 50 కిలోల కన్నా తక్కువ బరువున్నవారు
- ఇన్సులిన్ వాడూ మధుమేహ బాధితులు
- రక్తపోటు 140 కన్నా ఎక్కువ ఉన్న వారు
- డయాస్టోలిక్ ప్రెజర్ 60కన్నా తక్కువ- 90కన్నా ఎక్కువ ఉన్నా..
- కేన్సర్ బారిన పడి కోలుకున్నవారు, మూత్రపిండ, కాలేయ, ఊపిరితిత్తులు, హృద్రోగాలతో బాధపడుతున్నవారు అనర్హులు.
ఎన్నాళ్లకొకసారి ఇవ్వొచ్చు?
అర్హులైన దాతలు ప్రతి రెండువారాలకూ 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను దానం చేయొచ్చు.
ఎంత కాలం భద్రపరచవచ్చు?
సేకరించిన ప్లాస్మాను అతి శీతల వాతావరణంలో కనీసం సంవత్సరం దాకా భద్రపరచవచ్చు. దాన్ని ఫ్రోజెన్ ప్లాస్మా అంటారు. అప్పటి కీ అందులో యాంటీబాడీలు అలాగే ఉంటాయి.
రాష్ట్రంలో 5 కార్పొరేట్ ఆస్పత్రుల్లో..
భారత వైద్య పరిశోధన మండలి ప్లాస్మా థెరపీకి అనుమతులను సులభతరం చేసింది. దరఖాస్తు చేసుకున్న కొద్దిరోజుల్లోనే అనుమతులు ఇస్తోంది. దీంతో చాలా ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు ప్లాస్మా థెరపీ అందించడానికి ముందుకొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉంది. కిమ్స్‌లో 15 మందికి ప్లాస్మా చికిత్స చేయగా.. ఐదుగురు కోలుకున్నారు. మిగతావారికి చికిత్స కొనసాగుతోంది. అలాగే.. జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలోని రెండు కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఈ చికిత్సను అందిస్తున్నాయి. సోమాజిగూడ, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లోని రెండు కార్పొరేట్ ఆస్పత్రులు ప్లాస్మా థెరపీ చేసేందుకు సిద్ధమయ్యాయి.
గాలి, వెలుతురు చాలా ముఖ్యం
ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తల్లో ఒకటి.. మనం ఉండే ప్రదేశంలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవడం. గాలి, వెలుతురు రాని ప్రదేశాల్లో పాజిటివ్ పేషెంట్లు ఉంటే.. వారి నుంచి అక్కడున్న ఇతరులకు కరోనా సోకే ముప్పు చాలా ఎక్కువ. కాబట్టి మనం ఉండే ప్రదేశంలో ఎప్పుడూ తాజా గాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటే చాలా వరకూ ముప్పు తగ్గుతుంది.
- డాక్టర్ శరత్ చంద్రమౌళి, రుమటాలజిస్టు, కిమ్స్