పీహెచ్‌సీల్లోనూ పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-19T07:38:21+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేని వారికి గ్రామస్థాయిలోనే వైద్యం అందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.

పీహెచ్‌సీల్లోనూ పరీక్షలు

మండల స్థాయిలో ఐసొలేషన్‌ కేంద్రాలు

ఒకట్రెండు రోజుల్లో కిట్ల సరఫరా.. 

అనుమానితులందరికీ టెస్టులు

జిల్లాల్లో కేసుల పెరుగుదలతో నిర్ణయం

వచ్చిన ఏ రోగినీ వెనక్కి పంపొద్దు

కరోనా మందులన్నీ అందుబాటులో

అన్ని మందుల షాపుల్లో లభ్యత

ప్రతి ప్రభుత్వాస్పత్రికి విధిగా సరఫరా

మందులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలొద్దు

రెమ్డెసివిర్‌ పూర్తిస్థాయి లభ్యత త్వరలో

ఆ కంపెనీతో సీఎం మాట్లాడారు: ఈటల


హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేని వారికి గ్రామస్థాయిలోనే వైద్యం అందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు చేరడం.. అక్కడా పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పీహెచ్‌సీల్లో చేసేవన్నీ కూడా యాంటీజెన్‌ టెస్టులనేనని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలకు ఒకట్రెండు రోజుల్లో యాంటీజెన్‌ కిట్లను పంపనున్నారు. అవి పీహెచ్‌సీలకు చేరగానే కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి టెస్టులు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


ప్రాథమిక దశలోనే వైర్‌సను గుర్తించి వైద్యం అందించేందుకు గ్రామ స్థాయి లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. .జ్వరం వచ్చిన వారిని సబ్‌ సెంటర్‌ స్థాయిలోనే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి అక్కడే వైద్య పరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా ఉందా లేదా అని నిర్ధారణ చేస్తామని ఆయన తెలిపారు పాజిటివ్‌ ఉండి లక్షణాలు లేని వారిని కూడా హోమ్‌ ఐసొలేషన్‌ ఉంచి చికిత్స అందిస్తామన్నారు. గ్రామీణ స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మండల స్థాయిలోనే ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇంట్లో సౌకర్యం లేని అసింప్టమాటిక్‌ వారిని అక్కడ ఉంచనున్నారు. ఇప్పటి దాకా హైదరాబాద్‌, దానిచుట్టుపక్కలే కేంద్రంగా పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నారు. అన్నిచోట్లా కేసులు నమోదు అవుతుండటంతో పీహెచ్‌సీ స్థాయిలో టెస్టులకు శ్రీకారం చుట్టనున్నారు. 


పెద్దాస్పత్రులపై భారం పడకుండా...

కరోనా రోగులకు లక్షణాలను బట్టి ఎక్కడికక్కడే వైద్యం అందించాలని సర్కారు భావిస్తోంది. లక్షణాలు లేనివారికి మండలస్థాయిలో, కొద్దిపాటి చికిత్స అవసరమైన వారికి జిల్లా ఆస్పత్రులకు తరలించనున్నారు. సీరియస్‌ కేసులను హైదరాబాద్‌కు తరలించనున్నారు. జిల్లాల్లో చికిత్స అవసరమయ్యే కేసులను జిల్లా ఆస్పత్రితో పాటు, ప్రభుత్వ వైద్య విద్య కాలేజీ లేదా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు పంపనున్నారు. తద్వారా అందరికీ హైదరాబాద్‌లో చికిత్స అందించే అవసరం రాదని, పెద్దాస్పత్రులపై భారం తగ్గుతుందని సర్కారు భావిస్తోంది. 


ఆ మాట వినిపించొద్దు: ఈటల 

కరోనాను పూర్తిగా నియంత్రించే వరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, కరోనా మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన బీఆర్కే భవన్‌లో కరోనా మందుల కంపెనీలు, డీలర్లతో, అనంతరం కోఠీలోని కమాండ్‌ కంట్రోల్‌లో హైదరాబాద్‌ సర్కారీ ఆస్పత్రుల సూపరెంటెండ్స్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మందుల కొరత లేకుండా చూడాలని, వాటిని బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా చూడాలని డీలన్లను కోరారు.  గ్రామస్థాయి నుంచి ప్రతి మందుల షాప్‌లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి విధిగా కరోనా మందులు సరఫరా చేయాలని కోరారు.


వైరస్‌లోడ్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న రెమెడిసివిర్‌ మందును తయారు చేస్తున్న హెటిరో కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌  స్వయంగా మాట్లాడారని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మందులను పంపిణీ చేయాలని కోరారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఆ మందు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆస్పత్రుల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని  సూపరింటెండెంట్లకే ఇచ్చారు.  పరికరాలను అడిగిన 24 గంటల్లోనే ఇస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చిన ఏ ఒక్క రోగిని కూడా వెనక్కి పంపకూడదని, ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్థారణ పరీక్షలు చేసి అవసరమైన  ఆస్పత్రికి పంపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రులు చుట్టూ పేషెంట్లు తిరుగుతున్నారంటూ వస్తున్న వార్తలకు స్వస్తి పలకాలని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిపై స్పందిస్తూ హైటెక్‌ యుగంలో పురాతన కట్టడాలతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని ప్రజలు ప్రాణాలు హరించే విధంగా ఉన్న ఆ ఆస్పత్రిని  ఆధునీకరించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు.

Updated Date - 2020-07-19T07:38:21+05:30 IST