జనరిక్ మందులపై చిన్నచూపు
ABN , First Publish Date - 2020-03-13T11:34:48+05:30 IST
జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల పేర్లు మాత్రమే వేరు. తయారీ ఒకటే, ఫార్ములా ఒకటే. జనరిక్ మందులు తక్కువ ధరకు వస్తున్నాయని, అవి సరిగా పనిచేస్తాయో లేవోనని ప్రజలు అపోహ పడుతున్నారు. వైద్యులు జనరిక్ మందులపై శ్రద్ధ చూపడం లేదు.

పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలు
రోగులకు సూచించడంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం
ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలం
ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు
నర్సంపేట టౌన్ :
జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల పేర్లు మాత్రమే వేరు. తయారీ ఒకటే, ఫార్ములా ఒకటే. జనరిక్ మందులు తక్కువ ధరకు వస్తున్నాయని, అవి సరిగా పనిచేస్తాయో లేవోనని ప్రజలు అపోహ పడుతున్నారు. వైద్యులు జనరిక్ మందులపై శ్రద్ధ చూపడం లేదు. రోజుల తరబడి మందులు వాడే ఆర్థిక స్థోమత లేని ప్రజలకు జనరిక్ మందులు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరికి మందులకయ్యే ఖర్చు వేలల్లో ఉంటున్నందున చౌకగా లభించే జనరిక్ మందులపై దృష్టి సారిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు జనరిక్ మందులను ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. బ్రాండెడ్ మందులతో తమకు లాభసాటిగా ఉంటుందని, జనరిక్‌తో తమకు వచ్చే లాభం ఏముండదని వైద్యులు జనరిక్ మందులను రోగులకు సూచించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో 200కు పైగా ప్రైవేట్ కార్పొరేట్, నర్సింగ్‌హోంలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీ రోజు లక్షల రూపాయల విలువైన మందుల వ్యాపారం జరుగుతోంది. ఇందులో జనరిక్ మందులు కేవలం మూడు శాతం కూడా లేకపోవడం గమనార్హం. దీంతో రోగులపై 30 నుంచి 40శాతం ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వసతులు, మందుల కొరతతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుసంధానంగా ఉండే మెడికల్ షాపులతో పాటు ఇతర మెడికల్ షాపుల నిర్వాహకులు రోగుల నుంచి ఎడా పెడా డబ్బులు వసూలు చేస్తున్నారు. వైద్యులు జనరిక్ మందులను తప్పనిసరిగా రాయాలని జాతీయ వైద్య మండలి చెబుతున్నపటికీ ఎక్కడా అమలు జరగడం లేదు.
అధికారుల చర్యలు శూన్యం...
జనరిక్ మందుల వినియోగంపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ లేకుండా పోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఔషధ నియంత్రణ అధికారులకు సమన్వయం లేకపోవడంతో మందుల వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతూ రోగులను ఆర్థికంగా పీల్చి పిప్పిచేస్తున్నారు. అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలేదు. దీంతో తమకు లాభసాటిగా ఉండే మందులనే రాస్తూ, జనరిక్ మందులను సూచించడం లేదు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి ఆవరణలోని జనరిక్ మందుల షాపు వద్ద ప్రజలకు కాంపోనెంట్‌ను బట్టి రోగులకు మందులను విక్రయిస్తున్నారే తప్ప, వైద్యులు నేరుగా జనరిక్ మందులు రాయడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రజల్లో అవగాహన కల్పించాలి
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నా, అటువంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రధానమంత్రి మోదీ జన ఔషధి పథకం ద్వారా దేశంలో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేశారు. కానీ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన లేకపోవడంతో జనరిక్ మందులను కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిన జనరిక్ మందులపై ఇప్పటికైనా అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జనరిక్ మందుల ప్రయోజనాలివే...
ఔషధ కంపెనీ ఒక మందును తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేయాలంటే నేరుగా సూపర్‌స్టాకిస్టులకు అందజేస్తుంది. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లకు, రిటైలర్‌కు అక్కడి నుంచి మెడికల్ షాపులకు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి రూ.10 ధర ఉన్న ఔషధం రూ.60కి చేరుతుంది. ఈ విధానాన్ని పక్కనపెట్టి ఔషధ కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసేవే జనరిక్ మందుల షాపులు. దీంతో 70శాతం తక్కువ ధరతో మందులు ప్రజలకు అందుబాటులో లభిస్తున్నాయి.
ఔషధం పేరు మెడికల్ షాపులో.. జనరిక్ షాపులో..
పారాసిటమోల్(10) రూ.10 నుంచి రూ.20 రూ.6 నుంచి రూ. 8
సిట్రజన్(10) రూ.30 నుంచి రూ.40 రూ.3 నుంచి రూ.5
బీపీ మాత్రలు రూ.30 రూ.5
ఎలాప్రిల్ రూ.20 రూ.6
సెఫిక్సిమ్ రూ.210 రూ.80
అగ్జెంటివ్(6) రూ.260 రూ.75
కాల్షియం(500ఎంజి) (15) రూ.50 రూ.10
వింపిరో (ఇంజక్షన్) రూ.160 రూ.65
పెంటాప్రోజల్ రూ.70 రూ.25
అస్కారిల్(సిరప్) రూ.40 రూ.22
అవగాహన కల్పిస్తాం : డాక్టర్ కొమురయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో
జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ప్రజలు ఇప్పుడిప్పుడే జనరిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి మందులు, పరీక్షల పేరుతో దోచుకుంటున్నాయి. డ్రగ్ ఇన్స్‌పెక్టర్ మందుల విషయంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంది. మేము కూడా ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. వైద్యులు జనరిక్ మందులు రాసేలా చర్యలు తీసుకుంటాం.
జనరిక్ మందులనే రాయాలి : ఎర్రబోయిన రాజశేఖర్, ఏఎ్‌సఆర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, నర్సంపేట వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులను రాయాలి. దీంతో ఎంతో మంది పేద రోగులకు మేలు జరుగుతుంది. రూ.5 విలువ చేసే మాత్ర ఇతర షాపుల్లో రూ.30లకు విక్రయించడంతో రోగులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులను రాసేలా కఠిన చర్యలు తీసుకోవాలి.