పండ్లంటే చేదెందుకు?

ABN , First Publish Date - 2020-04-05T11:11:33+05:30 IST

పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని.. సీజన్‌ను బట్టి దొరికే పండ్లను తింటే మరీ మంచిదని వైద్యులు చెబుతుంటారు. అయితే మన రాష్ట్రంలో పండ్ల వినియోగం తగ్గుతోందని భారతీయ వైద్య పరిశోధన సంస్థ...

పండ్లంటే చేదెందుకు?

  • రాష్ట్రంలో తగ్గుతున్న పండ్ల వినియోగం
  • తేల్చిన భారత వైద్య పరిశోధన సంస్థ సర్వే
  • రోగ నిరోధక శక్తి తగ్గటంతోనే సమస్యలు
  • రోజుకు 100 గ్రాముల పండ్లు తినాల్సిందే
  • ప్రస్తుతం సిట్రస్‌ జాతి పండ్లు మేలని వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని.. సీజన్‌ను బట్టి దొరికే పండ్లను తింటే మరీ మంచిదని వైద్యులు చెబుతుంటారు. అయితే మన రాష్ట్రంలో పండ్ల వినియోగం తగ్గుతోందని భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌) సర్వే తేల్చింది. తెలంగాణలో తలసరి పండ్ల వినియోగం చాలా తక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది. ప్రతి మనిషి రోజుకు కనీసం 100 గ్రాముల పండ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషక విలువలు సమపాళ్లలో అంది ఆరోగ్యంగా ఉంటారని నివేదికలో పేర్కొంది. ఈ అంచనా ప్రకారం తెలంగాణలో సగటున ప్రతి వ్యక్తి నెలకు 3 కిలోల పండ్లు తినాల్సి ఉంటుందని, తద్వారానే విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని ఐసీఎంఆర్‌ సిఫారసు చేసింది. రాష్ట్రంలో మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి, దానిమ్మ లాంటి పండ్లతోటలు 4.41 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి.


ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా 70 వేల టన్నుల బత్తాయి, 1.22 లక్షల టన్నుల నిమ్మ, 5 లక్షల నుంచి 6 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుంది. రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం నెలకు 2 కిలోల బత్తాయి, ఒక కిలో మామిడి వినియోగించినా.. సుమారు 1.20 లక్షల టన్నుల బత్తాయి, మామిడి మనకు సరిపోతాయి. రాష్ట్రంలో జరిగే బత్తాయి ఉత్పత్తిలో 98ు రాజస్థాన్‌, గుజరాత్‌, జమ్మూ కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాలకే ఎగుమతి అవుతోంది. ఇక్కడి ప్రజల వినియోగం తక్కువ ఉండటం, పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉండటంతో పండ్లన్నీ బయటకు వెళ్తున్నాయి.


సిట్రస్‌ జాతి పండ్ల వినియోగం తప్పనిసరి

ఐసీఎంఆర్‌ సిఫారసుల ప్రకారం సిట్రస్‌ జాతి పండ్ల వినియోగం గణనీయంగా పెరగాలి. ఇటీవల  సీఎం కేసీఆర్‌ కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బత్తాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి పండ్లు విరివిగా తినాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైర్‌సను నియంత్రించేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని కూడా సూచించారు.బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషద గుణాలు కూడా ఉన్నాయి. విటమిన్‌- సి  పుష్కలంగా లభిస్తుంది. పీచు పదార్థాలు, జింక్‌, కాపర్‌, ఐరన్‌, కాల్షియం విరివిగా ఉండ గా, క్యాలరీలు, కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుం ది. అలసటను, ఊబకాయాన్ని కూడా బత్తాయి తగ్గిస్తుందని, రోజుకు 200 మి.లీ రసం తాగితే మేలని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మ కాయల్లోనూ విటమిన్‌- సి, పీచు పదార్థాలు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, కొవ్వు తగ్గేందుకు, బరు వు నియంత్రణకు, జీర్ణకోశ ఆరోగ్యానికి నిమ్మ దోహదపడుతుంది. జలుబు, దగ్గు లాంటి వ్యాధులకు మామి డి దివ్య ఔషదంలా పనిచేస్తుందని, మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఐసీఎంఆర్‌ సిఫారసు చేసింది. పండ్ల ముక్కలు, రసం, పచ్చళ్లు, మామిడి తాండ్ర, ఒరుగులు, ఆంచూర్‌తో ఏడాది పొడవునా కావాల్సిన పోషకాలు మామిడి ద్వారా పొందే అవకాశం ఉందని తెలిపింది. 


మొబైల్‌ రైతు బజార్లలో పండ్ల విక్రయం

రాష్ట్రంలో పండ్ల వినియోగం తక్కువ ఉన్న మాట వాస్తవమే! ఇక్కడి రైతులు ఉత్పత్తి చేసిన మామిడి, నిమ్మ, బత్తాయి కాయలను ఇక్కడే వినియోగించేలా ఏర్పాట్లు చేయాలంటూ సీఎం కేసీఆర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. మార్కెటింగ్‌, ఉద్యానశాఖల సమన్వయంతో మొబైల్‌ రైతు బజార్ల ద్వారా పండ్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్‌లో 3,500 ప్రాంతాలకు నిత్యం వాహనాలు పంపిస్తూ ఇంటి వద్దకే పండ్లు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.               

  - వెంకట్రాంరెడ్డి, కమిషనర్‌, హర్టికల్చర్‌


Updated Date - 2020-04-05T11:11:33+05:30 IST