చిలుకూరు బాలాజీ దేవాలయంలో ‘రేపాసుర’ నిర్భయ దోషుల దిష్టిబొమ్మల దహనం

ABN , First Publish Date - 2020-03-21T17:13:00+05:30 IST

నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులను తిహార్ జైలులో ఉరి తీసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రజలు వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు.....

చిలుకూరు బాలాజీ దేవాలయంలో ‘రేపాసుర’ నిర్భయ దోషుల దిష్టిబొమ్మల దహనం

చిలుకూరు (హైదరాబాద్): నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులను తిహార్ జైలులో ఉరి తీసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రజలు వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిర్భయ కేసులో దోషులైన అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్ సింగ్ ల 11 అడుగుల దిష్టిబొమ్మలకు ‘రేపాసుర’ పేరిట నామకరణం చేసి దహనం చేశారు.


దీపావళి సందర్భంగా నరకాసురుడి  అంతం చేసినట్లు...నిర్భయ కేసులో దోషులైన నలుగురు నరకాసురులను ఉరి తీశారని, అందుకే ప్రజలతో కలిసి తాము వారి దిష్టిబొమ్మలను దహనం చేశామని బాలాజీ దేవాలయం పూజారి రంగరాజన్ చెప్పారు. దోషులు న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేశారని రంగరాజన్ ఆరోపించారు. సమాజంలో ప్రతీ పౌరుడు రామాయణంలో ‘జటాయు’ పాత్ర పోషించాలని రంగరాజన్ పిలుపునిచ్చారు. దుష్ట రావణుని బారి నుంచి సీతామాతను రక్షించేందుకు జటాయు పోరాడినట్లు మనమంతా పోరాడాలని రంగరాజన్ సూచించారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చేస్తే చాలదని, యువత మహిళల రక్షణకు పాటుపడాలని ఆయన కోరారు.

Updated Date - 2020-03-21T17:13:00+05:30 IST