వీరుడా.. వందనం!
ABN , First Publish Date - 2020-06-18T09:18:41+05:30 IST
దేశ సరిహద్దులను చెరగనీయనంటూ.. చైనా దాష్టీకాన్ని సహించనంటూ భరత జాతి కోసం ఎదురొడ్డి నిలబడి వీర మరణం పొందిన సూర్యాపేట ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు యావత్ దేశం అశ్రు

- కల్నల్ సంతోష్‌కు అశ్రు నివాళులు..
- నేడు సూర్యాపేటలో అంత్యక్రియలు
(న్యూస్‌నెట్‌వర్క్, ఆంధ్రజ్యోతి)
దేశ సరిహద్దులను చెరగనీయనంటూ.. చైనా దాష్టీకాన్ని సహించనంటూ భరత జాతి కోసం ఎదురొడ్డి నిలబడి వీర మరణం పొందిన సూర్యాపేట ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు యావత్ దేశం అశ్రు నివాళులర్పిస్తోంది. ‘మా కోసం ప్రాణాలిస్తివి కదా బిడ్డ’ అంటూ ఆయన త్యాగాని కి సెల్యూట్ చేస్తోంది. ఇక ఆయన మరణవార్త విని స్వస్థలం సూర్యాపేట కన్నీటి సంద్రంలో ము నిగిపోయింది. గురువారం ఉదయం సూర్యాపేట పట్టణ సమీపంలోని కాసరబాదలో సంతోష్బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ గ్రామంలోని వారి వ్యవసాయ భూమిలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఆర్మీ అధికారి సుబేదార్ దినే్‌షకుమార్ సూర్యాపేటకు చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఢిల్లీలో ఉంటున్న సంతోష్ బాబు భార్య సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్ తేజ బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పోలీస్‌కమిషనర్ వీసీ సజ్జనార్, శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకా ష్‌రెడ్డి, ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ విజయ్‌కుమార్, పలువురు సైనికాధికారులు వారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ప్రత్యేక భద్రత నడుమ వారిని సూర్యాపేటకు తీసుకెళ్లారు. కాగా, సంతోష్బాబు భౌతికకాయం ప్రత్యేక విమానంలో బుధవారం హకీంపేటకు చేరుకొంది. గవర్నర్ తమిళసై, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పార్ధివ దేహానికి అంజలి ఘటించారు. భౌతికకాయాన్ని అక్కడనుంచి సూర్యాపేటకు రాత్రి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, ప్రజలు కల్నల్ నివాసానికి అధికసంఖ్యలో తరలివచ్చారు. పలువురు ప్రముఖులు సంతోష్ బాబు తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. దేశం ఒక వీరుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటించారు. జిల్లావ్యాప్తంగా సంతోష్ బాబు చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు.. చైనాకు బుద్ధి చెప్పాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చైనా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను, జాతీయపతాకాన్ని వివిధ పార్టీల నేతలు, ప్రజలు దహనం చేశారు.
ఓనమాలు దిద్దింది లక్సెట్టిపేటలోనే!
కల్నల్ సంతోష్ బాబు ఓనమాలు దిద్దింది మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోనే! ఆయన తండ్రి ఉపేందర్ 1988 నుంచి 1993 వరకు ఎస్‌బీహెచ్‌లో పనిచేశారు. దీంతో స్థానిక శ్రీసరస్వతీ శిశుమందిర్ విద్యాలయంలో సంతోష్ ప్రాథమిక విద్య పూర్తయింది. 6వ తరగతిలో కోరుకొండ సైనిక్ స్కూల్‌కు ఎంపికకావడంతో సంతోష్‌బాబు అక్కడకు వెళ్లినట్లు ఆయన సహ విద్యార్థులు తెలిపారు.