హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో రగడ

ABN , First Publish Date - 2020-12-26T04:46:32+05:30 IST

హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో రగడ

హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో రగడ
రోగిని అంబులెన్స్‌లోనే ఉంచిన రోహిణి ఆస్పత్రి సిబ్బంది

చికిత్సకోసం వచ్చిన మహిళ మృతి

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ 


హన్మకొండ అర్బన్‌, డిసెంబరు 25 : చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ అంబులెన్స్‌లో మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు రోహిణి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలోని పూలతొట్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంలో సుబేదారి పోలీసులు రంగప్రవేశం చేశారు. వివరాల్లోకి వెళితే.. మడికొండలోని బుడిగజంగాల కాలనీకి చెందిన కొమురమ్మ (46) శ్వాస సరిగ్గా ఆడకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రోహిణి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఓపీ విభాగంలో రిసీట్‌ తీసుకొని అడ్మిట్‌ అయ్యారు. కొమురమ్మను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఫ్లూయిడ్స్‌, ఎమర్జెన్సీ ఇంజక్షన్లు ఇచ్చారు. వెంటిలేటర్‌ అవసరముందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి కొమురమ్మను ఎంజీఎంకు తీసుకెళ్లాలని సూచించారు. వారి అంబులెన్స్‌లోనే రోగిని ఉంచారు. కాగా, సిబ్బంది ఎవరూ రాకపోవడంతో అంబులెన్స్‌లో మహిళకు ఫిట్స్‌ వచ్చి మృతి చెం దింది. దీంతో కోపోద్రిక్తులైన రోగి బంధువులు ఆం దోళనకు దిగారు. అడిగినంత డబ్బులు తీసుకురాలేదనే సాకుతో ఎంజీఎంకు తీసుకెళ్లాలని వైద్యులు బయటకు పంపారని ఆరోపించారు. అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. చాలాసేపటి వరకు సిబ్బంది అంబులెన్స్‌ వద్దకు రాకపోవడంతో పరిస్థితి విషమించి మృతి చెందిందని తెలిపారు. 

కాగా, మహిళ మృతితో ఆస్పత్రి వైద్యుల తప్పే మీ లేదని రోహిణి ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రోగి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ అవసరముందని సూచించామని, ఇంకా చికిత్స మొదలు పెట్టనేలేదని తెలిపారు. రోగి బంధువులు ఆర్థిక పరిస్థితి బాగాలేదం టే ఎంజీఎంకు పంపామని తెలిపారు. రోగి బంధువులు ఫర్నిచర్‌ ధ్వంసం చేయడంతో సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-26T04:46:32+05:30 IST