తనిఖీల తరువాతే పాస్‌బుక్
ABN , First Publish Date - 2020-10-03T09:04:59+05:30 IST
వ్యవసాయేతర ఆస్తులపై పౌరులకు హక్కు కల్పించేందుకు ఇవ్వనున్న మెరూన్ కలర్ పాస్‌బుక్ విస్తృత తనిఖీ తరువాతే జారీ

సర్వేలో ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించాకే జారీ
కచ్చితమైన సమాచారం ఇచ్చే బాధ్యత పౌరులదే
ఇంటి యజమాని పేరే.. అద్దెదారుల నమోదు లేదు
వివరాలు ఒకసారి నమోదైతే మార్చే వీలుండదు
ఓపెన్ ప్లాట్ల వివరాల వెల్లడి స్వచ్ఛందమే!
గ్రామకంఠం, దేవాదాయ , వక్ఫ్ భూముల్లో..
ఇళ్లు ఉంటే అది ప్రభుత్వ భూమి కిందే లెక్క!
10 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ మినహాయింపు
ఆస్తుల గణనకు వెళితే అత్యాచార యత్నం
ఇంటి యజమాని ఘాతుకం.. అట్రాసిటీ కేసు నమోదు
తేడా వస్తే కొలతలు
ఇచ్చిన సమాచారంలో ఏవైనా తేడాలున్నట్లు అనుమానం వేస్తే కొలతలు వేసి, నిర్ధారించుకోవాలి. వివరాల నమోదు బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ప్రజలు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో చాటింపు వేయించాలి. ఎడిట్ ఆప్షన్‌లు ఉండవు.
సందీప్ కుమార్ సుల్తానియా
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర ఆస్తులపై పౌరులకు హక్కు కల్పించేందుకు ఇవ్వనున్న మెరూన్ కలర్ పాస్‌బుక్ విస్తృత తనిఖీ తరువాతే జారీ కానుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా వాస్తవాల పరిశీలన జరగనుంది. అందుకే పౌరులు కచ్చితమైన సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. యజమానిని ఇంటిముందు నిలిపి ఆయన ఫొటో తీసుకుంటారు. గ్రామాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలన్ని ప్రభుత్వ ఆదేశం నేపథ్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందనరావు శుక్రవారం జిల్లా, మండల పంచాయతీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కచ్చితమైన సమాచారం ఇచ్చే బాధ్యత పౌరులదేనని, దీనిని సేకరించే విషయంలో క్షేత్రస్థాయి అధికారులు జాగ్రత్త వహించాలని ఆదేశించారు. తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలుంటాయన్నారు. ఒకసారి నమోదు చేసిన వివరాలను మార్చడానికి వీలుండదని స్పష్టం చేశారు.
కాగా, సర్వేలో ఆధార్ పూర్తిగా తప్పనిసరి కాకపోయినా దానిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే 10 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ప్రతి ఇంటికి ఉన్న నల్లా, కరెంట్ కనెక్షన్ వివరాలను సర్వేలో నమోదు చేస్తుండగా.. గ్రామాల్లో కొన్ని ఇళ్లకు కరెంట్ మీటర్లు లేవని పంచాయతీ కార్యదర్శులు అధికారుల దృష్టికి తీసుకురాగా.. ఏ సమాచారం ఉంటే అదే నమోదు చేయాలన్నారు. కొన్ని జిల్లాల్లో అటవీ భూముల్లో ఇళ్లు ఉండడం, కార్యదర్శులకు ఇచ్చిన యాప్‌లో ఆ కాలమ్ లేకపోవడంతో ప్రభుత్వ భూమిలో ఇల్లు ఉన్నట్లు నమోదు చేయాల్సిందిగా సూచించారు. గ్రామ కంఠం, దేవాదాయ, వక్ఫ్ ఆస్తుల్లో ఇళ్లు ఉన్నా ప్రభుత్వ భూమిగానే నమోదు చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లయితే ప్రత్యేకంగా తీసుకుంటారు. వాణిజ్య భవనాలు, నివాసిత భవనాలను వేర్వేరుగా నమోదు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇంట్లో ఒకరి కన్నా ఎక్కువ మంది కుమారుల కుటుంబాలు నివాసముంటే.. ఇంటి నెంబరు ఒకటే అయినా వివరాలను వేర్వేరుగా నమోదు చేయాలన్నారు.
ఇంటి యజమాని పేరే..
వ్యవసాయేతర ఆస్తుల నమోదులో అద్దెదారులకు చోటు లేదు. ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నా యజమానుల పేరే ఎక్కిస్తారు. ఒకరికి ఎన్ని చోట్ల ఇళ్లు ఉన్నా ఆయా ప్రాంతాల్లో అతని పేరు నమోదుకే అవకాశముంది. దీంతో ఆధార్‌ను అనుసంధానం చేసినప్పుడు ఈ సమాచారం బయటపడే వీలుంది. ఇక సర్వేలో ఆస్తిపన్ను నంబరు, ఇంటి నంబరు తప్పనిసరి చేశారు. సర్వే సిబ్బంది ఒక ఇంటికి వెళ్లినపుడు ఈ రెండింటిని క్లిక్ చేయగానే ఆ ఇంటి యజమాని సమాచారం యాప్‌లో వస్తోంది. అయితే ఖాళీ ప్లాట్లకు ఆస్తి పన్ను చెల్లించడంలేదు. ప్లాటు నంబరు కూడా సర్వే సిబ్బందికి తెలియదు. దీంతో ఎవరైనా తమకు ప్లాటు ఉందని చెబితేనే ఆ వివరాలు తీసుకోగలుగుతున్నారు. దీంతో ప్రస్తుతానికి ఓపెన్ ప్లాట్లను వదిలేసినట్లేనని భావిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలకు ఈ అవకాశం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కాగా, సర్వే సందర్భంగా ఇళ్ల యజమానులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ‘ఇల్లు లేదా ఫ్లాటు కొన్నపుడే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఆస్తి పన్ను కడుతున్నాం. మళ్లీ నమోదు చేయించుకోవడం ఎందుకు?’ అని అంటున్నారు. వీటికి సిబ్బంది వద్ద సరైన సమాధానం లేకపోయినా.. ప్రభుత్వం మెరూన్ కలర్ పాస్‌బుక్ ఇవ్వాలని నిర్ణయించినందున మళ్లీ వివరాలు సేకరిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఖాళీ ప్లాట్ల వివరాలు ఒకవేళ ఇప్పుడు చెప్పకపోతే.. ప్రభుత్వం ఇచ్చే పాస్‌బుక్‌లో అవి ఉండవు. ఈ నేపథ్యంలో తరువాతనైనా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందా? అప్పుడు ఏమైనా రుసుం వసూలు చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్‌ఆర్‌ఐల ఇళ్లు, ఫ్లాట్లలో అద్దెకు ఉంటున్నవాళ్లు యజమానుల వివరాలను సరిగా ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఎన్‌ఆర్‌ఐలే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఆధార్ కార్డు తీసుకోని ఎన్‌ఆర్‌ఐల పరిస్థితేంటన్నది తెలియడంలేదు.
ఆస్తుల గణనకు వెళితే అత్యాచార యత్నం
కనగల్: భర్త తరఫున ఆస్తుల గణన విధులకు వెళ్లిన మహిళపై ఓ ఇంటి యజమాని అత్యాచార యత్నం చేశాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం చినమాదారం గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చినమాదారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి పొలం పనులు ఉండటంతో తన భార్యను సర్వే విధులకు పంపాడు. గ్రామ కార్యదర్శి, దివ్యాంగుడైన మల్టీపర్పస్ వర్కర్‌తో కలిసి పిండి జాన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎంపీవో కార్యాలయానికి వెళ్లగా, మల్టీపర్పస్ వర్కర్ ఇంటి బయట ఉన్నాడు. మహిళ ఇంటి కొలతలు తీసుకుంటోంది. ఈ సమయంలో ఇంటి యజమాని జాన్‌రెడ్డి అత్యాచారయత్నం చేయడంతో ఆమె ప్రతిఘటించి బయటికి పరుగులు తీసింది. అనంతరం విషయాన్ని భర్తకు ఫోన్‌లో తెలపగా 100కు సమాచారం అందించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.