కన్న కొడుకును కడసారి చూసుకునేందుకు..తల్లిదండ్రుల ఎదురుచూపులు
ABN , First Publish Date - 2020-12-29T08:33:10+05:30 IST
కన్నపేగు తల్లడిల్లుతోంది.. కన్నీటి పర్యంతమవుతోంది.. ఆరు రోజుల క్రితం అమెరికాలో గుండెపోటుతో మృతిచెందిన తమ ఒక్కగానొక్క కుమారుడు గొట్టం చంద్రపాల్‌రెడ్డి (26)ని కడసారి కళ్లారా చూసుకునే
ఆరు రోజుల క్రితం అమెరికాలో మృతిచెందిన చంద్రపాల్‌రెడ్డి
మహబూబాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కన్నపేగు తల్లడిల్లుతోంది.. కన్నీటి పర్యంతమవుతోంది.. ఆరు రోజుల క్రితం అమెరికాలో గుండెపోటుతో మృతిచెందిన తమ ఒక్కగానొక్క కుమారుడు గొట్టం చంద్రపాల్‌రెడ్డి (26)ని కడసారి కళ్లారా చూసుకునే అవకాశాన్ని కల్పించాలని తల్లిదండ్రులు గొట్టం శ్రీనివా్‌సరెడ్డి-శోభారాణి సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులు గొట్టం శ్రీనివా్‌సరెడ్డి-శోభారాణిల కుమారుడు గొట్టం చంద్రపాల్‌రెడ్డి. ఆయన బీటెక్ చేసిన అనంతరం 2016లో అమెరికాలోని టెక్సా్‌సలో ఎంఎస్ పూర్తిచేశారు. అనంతరం ఓ వైపు పీహెచ్‌డీ చేస్తూనే.. మరోవైపు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. చంద్రపాల్‌రెడ్డికి ఇటీవల మరో కంపెనీలో ఉద్యోగం రావడంతో.. ఈనెల 22న రాత్రి స్నేహితులకు విందు ఇచ్చారు. అనంతరం అక్కడి నివాసానికి తిరిగి వెళ్తుండగా తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈవిషయం చంద్రపాల్‌రెడ్డి తల్లిదండ్రులకు తెలియడంతో.. వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి సమీప బంధువు ఇంట్లో ఉంటూ తమ కుమారుడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.