మా సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-07-28T07:06:05+05:30 IST

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి

మా సమస్యలు పరిష్కరించండి

  • ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు
  • ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నం.. అరెస్టు చేసిన పోలీసులు

బేగంపేట, జూలై 27 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు వారిని ప్రగతి భవన్‌ పరిసర ప్రాంతాల్లోకి రాక ముందే అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. అంతకు ముందు ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో వీరితో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంపై సంతృప్తి చెందని అద్దె బస్సుల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌ నేతృత్వంలో సుమారు 50 మందికి పైగా ప్రతినిధులు ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరారు.  ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3300 అద్దె బస్సులు నడుస్తున్నాయన్నారు. కరోనా ప్రభావంతో మే 19 నుంచి ప్రభుత్వం ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చినప్పటికీ ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 470, అంతర్‌ రాష్ట్ర సర్వీసులకు సంబంధించిన 100 బస్సులను నడపడం లేదన్నారు. వీటితో పాటు జిల్లాలో 20శాతం మాత్రమే నడపడం వల్ల అద్దె బస్సులపై ఆధారపడిన 15 వేల కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోయాయన్నారు. ఆర్టీసీ నుంచి రావాల్సిన  బిల్లులు మార్చి నుంచి పెండింగ్‌లో ఉండటంతో  డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు ఇవ్వలేదన్నారు. అదేవిధంగా  ఫైనాన్స్‌ సంస్ధలకు నెల వాయిదాలు కూడా చెల్లించలేక పోతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బస్సులు నడిపే పరిస్ధితి లేకపోతే కనీసం శివారు ప్రాంతాల్లోని గ్రామాలకైనా అనుమతిస్తే  తమకు ఉపాధి లభిస్తుందన్నారు. 

Updated Date - 2020-07-28T07:06:05+05:30 IST